బుద్దపూర్ణిమ రీ డెవలప్‌మెంట్‌కు మాస్టర్ ప్లాన్

by Mahesh |
బుద్దపూర్ణిమ రీ డెవలప్‌మెంట్‌కు మాస్టర్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: న్యూయార్క్, లండన్ నగరాల్లో సెంట్రల్ పార్కులను అభివృద్ధి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. కానీ మనకు నగరం మధ్యలో ఆ పరిస్థితి లేదు.కానీ హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్మించే స్కైవాక్ ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని అధికారుల అంచనా. అందులో భాగంగానే బుద్దపూర్ణిమ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి మరో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణహితంగా స్ట్రీట్ డెవలప్‌మెంట్‌తో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకనుగుణంగా పట్టణ ప్రాంతాలను ఆధునిక విధానంలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఐసీటీ నెట్‌వర్క్, స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ సిస్టం, నిఘా వ్యవస్థ, ల్యాండ్ స్కేప్ డిజైనింగ్ అందులో భాగంగానే బుద్దపూర్ణిమ పరిధిలోని మాస్టర్ ప్లానింగ్, ఆర్కిటెక్చరల్ డిజైన్స్, అండ్ డిటైల్డ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కోసం ఎక్స్ ఫ్రెషన్ ఇంట్రెస్ట్ టెండర్లు ఆహ్వానించారు.

పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి..

ఆసియా ఖండంలోనే హైదరాబాద్ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. ఐటీ రంగం, ఫార్మా, బయోటెక్నాలజీ, విద్యారంగం, తయారీ రంగం, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 1500 ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. డైనమిక్ స్కైలైన్ అండ్ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పుంజుకుంటున్నాయి. దేశంలోనే రియల్‌ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఇలాంటి మహానగరాన్ని ప్రపంచం పర్యాటకులు ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హుస్సేన్ సాగర్ విస్తీర్ణం 902 హెక్టార్లు..

హుస్సేన్ సాగర్ ఏరియా మొత్తం 902 హెక్టార్లలో విస్తరించి ఉందని హెచ్ఎండీఏ వెల్లడించింది. 2000 సంవత్సరంలో హుస్సేన్ సాగర్ ఏరియాను స్పెషల్ డెవలప్‌మెంట్ ఏరియాగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత హుడా, బీపీపీఏ, సీడీఏ, హడాలను ఏర్పాటు చేశారు. 2008లో హెచ్ఎండీఏను ఏర్పాటు చేశారు. బీపీపీ మాత్రం హెచ్ఎండీఏ పరిధిలోనే పనిచేస్తుంది. గతంలో హెచ్ఎండీఏ-2031 మాస్టర్ ప్లాన్ రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఆ మాస్టర్ ప్లాన్ ప్రణాళికబద్ధంగా రూపొందించలేదని గుర్తించారు. అందుకే హెచ్ఎండీఏ 2050 మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిలో ఉంది. దీంతోపాటు బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వాటర్ మేనేజ్‌మెంట్..

హుస్సేన్ సాగర్‌లో జీవవైవిధ్యాన్ని పునరుద్దరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. శుద్ధ జలాలతో హుస్సేన్ సాగర్‌ను నింపనున్నారు. ఇప్పటికే ఉన్న మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సాగర్‌లోకి మురుగునీటిని రాకుండా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

ల్యాండ్ స్కేప్‌కు పునరుజ్జీవనం..

హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ల్యాండ్ స్కేప్‌కు పునరుజ్జీవనం చేయనున్నారు. పీపుల్స్ ప్లాజాతో పాటు సైకిల్ ట్రాక్స్, గ్రీన్ స్పేస్, హాకర్స్ జోన్స్, రీక్రియేషనల్, టూరిస్ట్ ఏరియా, స్పోర్ట్స్ ఏరినా, పార్కింగ్ ప్రాంతాలు, కమర్షియల్, రిటైల్ ఏరియాలు, హాస్పిటాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా ఐకానిక్ నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఫైనాన్సియల్ ప్రాజెక్టులు..

బుద్దపూర్ణిమ ప్రాజెక్టు ఏరియాను ఫైనాన్సియల్ సెక్టార్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. అనేక ప్రైవేటు ఫైనాన్సింగ్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హుస్సేన్ సాగర్ చుట్టూ టవర్స్ నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది.

స్కైవాక్..

హుస్సేన్ సాగర్ చుట్టూ 10.5 కిలోమీటర్లు ఉందని అధికారులు గుర్తించారు. 6 మీటర్ల వెడల్పుతో స్కైవాక్ నిర్మించనున్నారు. అవకాశమున్న చోట రోడ్డు మీదగా స్తంభాలు ఏర్పాటు చేసి నిర్మించనున్నారు. స్థలం కొరత ఉన్న ప్రాంతాల్లో మాత్రం నీటిలో ఫిల్లర్లు వేయనున్నారు. 6 మీటర్ల వెడల్పులోనే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్‌లను సైతం ఏర్పాటు చేయనున్నారు. దీంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం, అమరవీరుల జ్యోతి, జీహెచ్ఎంసీ, బుద్దపూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ), బోట్స్ క్లబ్, సెయిలింగ్ క్లబ్, ఇందిరాపార్కు, లుంబినీపార్కులను అన్నింటికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా నడుచుకుంటూ వెళ్లడానికి అవకాశముంది.

రవాణా వ్యవస్థ..

హుస్సేన్‌సాగర్‌కు చేరుకోవడాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి ఖైరతాబాద్ మెట్రో, ఎంఎంటీఎస్‌ స్టేషన్లను అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం మెట్రో ప్రయాణీకులు ఖైరతాబాద్‌ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి నడిచి ఐమాక్స్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌ వద్దకు చేరుకుంటున్నారు. దీంతోపాటు ఎంఎంటీఎస్ ప్రయాణికులు కూడా ఖైరతాబాద్‌ స్టేషన్‌ నుంచి రాకపోకలు నిర్వహిస్తుంటారు. మెట్రో, ఎంఎంటీఎస్‌ అనుసంధానం చేయడంతో రెండు స్టేషన్లకు సులభంగా వెళ్లేందుకు అవకాశముంది. దీంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా పెరిగే అవకాశముంది.

21 ప్రాంతాల కేంద్రంగా..

ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ థియేటర్, అమ్యూజ్మెంట్ పార్క్, మార్షీల్యాండ్/ఎస్టీపీ సైట్, ఎస్టీపీ వద్ద బ్యూటిఫైడ్ లేక్, నెక్లెస్ రోడ్డు, పార్కింగ్ లాట్స్, పీపుల్ ప్లాజా, ఫుడ్ కోర్ట్స్, ఎం ఎం ఆర్ టీఎస్, రాక్ గార్డెన్, ఉద్యానవనం, ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, సంజీవయ్యపార్క్, లేక్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్, సేయిలింగ్ క్లబ్, ఇందిరాపార్క్, అంబేద్కర్ గార్డెన్, బోట్స్ క్లబ్, లుంబినీ పార్క్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. పాదచారుల కోసం ప్రత్యేక జోన్లు, హాకర్స్ కోసం బ్రిడ్జీలు, పర్యాటకుల కోసం సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Next Story

Most Viewed