అంబేద్కర్ మ్యూజియానికి శంకుస్థాపన చేయనున్న సీఎం

by Mahesh |
అంబేద్కర్ మ్యూజియానికి శంకుస్థాపన చేయనున్న సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మ్యూజియం, మెమోరియల్ లైబ్రరీ నిర్వహణను ప్రయివేటు కన్సల్టెన్సీకి ఇవ్వడానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తున్నది. మ్యూజియం, మెమోరియల్ లైబ్రరీ ట్రాన్సాక్షన్ అడ్వైజరీ, క్యూ రేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కు కన్సల్టెన్సీ కోసం హెచ్ఎండీఏ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) కోరింది. గత ప్రభుత్వం ఎన్టీఆర్ గార్డెన్ పక్కన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆయన జీవిత చరిత్ర, చేసిన పోరాటాలు, ఇతర అంశాలతో మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. ఆ పనులు నేటికీ పూర్తికాలేదు.

అయితే మ్యూజియం, మెమోరియల్ లైబ్రరీని ఏర్పాటుతోపాటు దీన్ని ప్రాజెక్టుగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. అందులో భాగంగానే ప్రయివేటు కన్సెల్టెన్సీ కోసం హెచ్ఎండీఏ ప్రతిపాదనలు కోరింది. ఈ ప్రాజెక్ట్ మీద సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్ విగ్రహాన్ని పట్టించుకోలేదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. వీటికి చెక్ పెట్టేలా ప్రాజెక్టును తీర్చిదిద్దాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు.

ప్రపంచ గమ్యస్థానంగా..

అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన పాల్గొన్న సెమినార్లు, కాన్ఫరెన్సెస్, లెక్చర్స్, ఫిలాసఫీ, ఆయన అందుకున్న అవార్డులు, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన కృషి, సామాజిక పోరాటాలు, రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర వంటి అంశాలు ప్రతిబింబించేలా, ప్రపంచ గమ్య స్థానంగా నిలిచేలా మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మ్యూజియం ద్వారా అనేక రకాల అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించడంతోపాటు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని డిసిషన్ తీసుకున్నారు.

సౌండ్ అండ్ లైటింగ్ షో

అంబేడ్కర్ కు సంబంధించిన చరిత్ర, ఇతర అంశాలను పుస్తకాలు, గ్రంథాల్లోనే కాకుండా ఆడియో సౌండ్ సిస్టం, లైటింగ్ షో ద్వారా వివరించడానికి ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని నిర్ణయించారు. రాజ్యాంగ రచనలో చేసిన కృషిని సైతం సౌండ్ సిస్టం ద్వారా వివరించనున్నారు. ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించనున్నారు. మ్యూజియంలో ఎగ్జిబిషన్ తో పాటు వర్క్ షాపులు, ఇంటరాక్షన్ జోన్స్, సావనీర్ షాప్స్ ఏర్పాటు చేయనున్నారు.

మాస్టర్ ప్లాన్

మ్యూజియం తో పాటు బిల్డింగ్ సిస్టం, ఎయిర్ కండిషన్, ఫైర్, సీసీటీవీ సిస్టం, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ డిజైన్స్ కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు. సైట్ ప్లాన్, ఫ్లోర్ ప్లాన్స్, ఎలివేషన్స్, సెక్షన్స్, ల్యాండ్ స్కేప్, విద్యుత్ దీపాలంకరణకు సంబంధించిన ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ అదిరిపోయేలా ఉండాలని డిసిషన్ తీసుకున్నారు. దీంతోపాటు పార్కింగ్, ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్స్, యుటిలిటీస్ ప్రణాళిక బద్దంగా ఏర్పాటు చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.

8 నెలల్లో

అంబేడ్కర్ మ్యూజియం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కోసం ఒక ఏజెన్సీ మాత్రమే తమ ప్రతిపాదనలు అందజేసింది. ఇలాంటి మ్యూజియాలు విజయవాడ, పుణె, చెన్నయ్, ఢిల్లీ నగరాల్లో ఉన్నాయి. అయితే హెచ్ఎండీఏ అధికారులు విజయవాడ, పుణెలోని మ్యూజియాలను సందర్శించడం తో పాటు అధ్యయనం చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును 8 నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏని ప్రభుత్వం ఆదేశించింది.

పోచంపల్లి పట్టు వస్త్రంపై చిత్రపటం

అంబేద్కర్ జయంతిని వినూత్నంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్కే భవన్, పోచంపల్లి పట్టు వస్త్రాలపై కళాకారుల చేత అంబేద్కర్ చిత్రపటాన్ని గీయనున్నారు. దీంతోపాటు జవహర్ లాల్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రాలను గీసే పోటీలను నిర్వహించనున్నారు. ఈ చిత్ర పటాలను మ్యూజియం తో పాటు కాంస్య విగ్రహం ఆవరణలో ఉంచనున్నారు.

బాబా సాహెబ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాంస్య విగ్రహ ప్రాంగణంలో ల్యాండ్ స్కేపింగ్ పనులు ఆదివారం సాయంత్రానికి పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విగ్రహంతోపాటు చుట్టుపక్కల ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఈ సారి అంబేడ్కర్ విగ్రహం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు.

Next Story

Most Viewed