మహిళా క్రికెట్‌లో లుకలుకలు

by Shyam |
మహిళా క్రికెట్‌లో లుకలుకలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పురుషుల జట్టులో 15 ఏళ్ల క్రితం సీనియర్ల మధ్య రాజకీయాలతో తీవ్ర విభేదాలు ఉండేవి. అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్, కెప్టెన్ సౌరవ్ గంగూలీ మధ్య గొడవతో జట్టు ఆటపై తీవ్ర ప్రభావం పడింది. జూనియర్లు, సీనియర్ల మధ్య గొడవలతో జట్టంతా గందరగోళంగా ఉండేది. ఇప్పుడు టీమ్ ఇండియా మహిళా జట్టు కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇటీవలే జట్టు హెడ్ కోచ్ పదవి కోల్పోయిన డబ్ల్యూవీ రామన్ టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుపై బహిరంగంగానే స్పందించారు. స్టార్ క్రికెటర్లు, జూనియర్ల మధ్య సఖ్యత లేదని.. తరచూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని రామన్ వెల్లడించారు. జట్టులో సఖ్యత కోసం ప్రయత్నించడమే తన పొరపాటు అని.. నా విషయంలో మాత్రం అందరూ ఏకమయ్యారని రామన్ ఆరోపించడం గమనార్హం. మహిళా జట్టులో లుకలుకలు ఉన్నట్లు బీసీసీఐ కూడా గుర్తించడంతోనే కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తున్నది.

రామన్ వెళ్లి పవార్ వచ్చె..

భారత దిగ్గజ క్రికెట్ డబ్ల్యూవీ రామన్ కోచింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారనే పేరుంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారని.. దీంతో ఆయనపై జట్టు సభ్యులు కోపం పెంచుకున్నట్లు తెలుస్తున్నది. స్టార్ క్రికెటర్లు తమకు అన్నీ తెలుసు అనే తలబిరుసుతో ఉంటారని.. కోచ్ మాటలు కూడా పట్టించుకునే వాళ్లు కాదని సమాచారం. మాజీ కోచ్ తుషార్ అరోథే కూడా జట్టులో జరుగుతున్న విషయాలపై తీవ్ర విమర్శలు చేశారు. టీమ్‌లో బయటకు కనిపించని రాజకీయాలు ఉన్నాయని ఆయన చెప్పారు. జట్టులో ఉన్న క్రికెటర్లను మాజీ క్రికెటర్లు శాసిస్తుంటారని.. వారు చెప్పినట్లే జట్టులోని సభ్యులు నడుచుకుంటారని తుషార్ ఆరోపించాడు. జట్టులో లుకలుకలు చోటు చేసుకున్నప్పుడల్లా కోచ్‌లపైనే వేటు పడుతుందని తుషార్ అన్నారు. ఎప్పుడైనా పెద్ద జట్లతో మ్యాచ్ ఉన్న సమయంలో.. మనం మరింతగా సిద్దపడాలని చెబితే.. కోచ్ మాటలను కూడా నిర్లక్ష్యం చేస్తారని.. అసలు కష్టపడకుండా మ్యాచ్ ఆడుతుంటారని తుషార్ అన్నారు. మాజీ కోచ్‌లు రామన్, తుషార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే టీమ్ ఇండియా మహిళా జట్టులో రాజకీయాలు బాగానే ఉన్నాయనిపిస్తున్నాయి.

కొత్త బ్యాటింగ్ కోచ్..

ఇటీవల మహిళా జట్టుకు డబ్ల్యూవీ రామన్ స్థానంలో రమేష్ పవర్‌ను హెడ్ కోచ్‌గా నియమించారు. విశేషం ఏంటంటే ఆయన గతంతో 5 నెలల పాటు మహిళా జట్టుకు కోచ్‌గా పని చేశారు. కానీ అప్పట్లో కెప్టెన్ మిథాలీ రాజ్‌తో విభేదాల కారణంగా అతి స్వల్ప సమయంలోనే కోచ్ పదవిని వదిలేశారు. కానీ తాజాగా తిరిగి అతడినే బీసీసీఐ మహిళా కోచ్‌గా నియమించింది. మరోవైపు టీమ్ ఇండియా చాలా ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్నది. దీంతో టీమ్ ఇండియా మాజీ టెస్ట్ ఓపెనర్ శివ్ సుందర్ దాస్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. భారత్ తరపున 23 టెస్టులు, 4 వన్డేలు ఆడిన దాస్ 2002లో ఇంగ్లాండ్ పర్యటించిన టీమ్ ఇండియాలో సభ్యుడు. ఢిల్లీ, రైల్వేస్ తరపున 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. గత నాలుగేళ్లుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్నారు. ఎంతో మంది క్రికెటర్ల బ్యాటింగ్ టెక్నిక్‌ను దాస్ సరిచేశాడు. ఇక జట్టు మేనేజర్‌గా తృప్తి భట్టాచార్యను తప్పించి రాణాకువార్ దేవీ గైక్వాడ్‌ను నియమించారు. టీమ్ ఇండియా మహిళా జట్టులో విభేదాలు వచ్చిన ప్రతీసారి కోచ్, సపోర్టింగ్ స్టాఫ్‌ను మారుస్తున్నారు. కానీ బీసీసీఐ ఆటగాళ్లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో కూడా ఈ రాజకీయాలు కొనసాగి జట్టు సమతుల్యాన్ని దెబ్బ తీస్తాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed