జనసేనపై YCP స్పెషల్ ఫోకస్.. రేపు సీఎం సొంత జిల్లాలో పవన్ పర్యటన!

by GSrikanth |
జనసేనపై YCP స్పెషల్ ఫోకస్.. రేపు సీఎం సొంత జిల్లాలో పవన్ పర్యటన!
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చేస్తున్నారు. ఇంతవరకూ వివిధ యాత్రల పేరుతో ఒక్కో ప్రాంతంలో పర్యటించిన పవన్ అక్టోబర్ 5 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా పర్యటన చేయనున్నారు. ఎన్నికలు ఏక్షణం అయినా రావొచ్చు అనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో పవన్ ఉన్నారు. అందులో భాగంగానే జనంలో‌కి జనసేన‌ను బలంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు.

సొంత జిల్లాతోనే ట్రయిల్

ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రల్ని అన్ని జిల్లాల్లో పూర్తి చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో నేడు పర్యటించబోతున్నారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధినేత పవన్ నేడు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. అప్పుల బాధలతో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అనంతరం రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో జరిగే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. రాజంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసే రచ్చబండలో పవన్ రైతు కుటుంబాల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం ప్రసంగం ఉంటుందని పార్టీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో పూర్తయ్యింది. ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో తొలివిడత యాత్రలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ పర్యటనకు పోలీసులు సహకరిస్తారా.. ఆంక్షలు విధిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే పశ్చిమగోదావరి సహా పలు జిల్లాల్లో పవన్ టూర్లకు పోలీసులు ఆంక్షలు విధిస్తూ వచ్చారు. దీంతో కడప జిల్లాలో నేడు జరగబోతుందని ఆశక్తి కరంగా మారింది.

దసరా నుంచి పూర్తిస్థాయి

దసరా నుంచి జనంలోకి వస్తానని.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను వింటానని జనసేన‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పుడు దానిని ఖాయం చేశారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల‌పై జనంలో అవగాహన పెంచుతామని జనసేన చెబుతున్నది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 కాదు కదా.. 30 సీట్లు కూడా రావని అంటున్నది. ఈ నేపథ్యంలో పవన్ యాత్ర ప్రకటన రాజకీయంగా చర్చను లేపింది.

ఇంకా ఖరారు కాని ఎజెండా

అయితే ఈ యాత్ర ఖచ్చితమైన ఎజెండా ఏంటనేది అధికారికంగా జనసేన ప్రకటించలేదు. సెప్టెంబర్ తొలి వారంలో పవన్ చేపట్టే యాత్ర స్వరూపం ఎలా ఉండబోతుంది. దాని విధి విధానాలు ఏంటి అనే దానిపై స్పష్టత రానుంది. 6 నెలల వ్యవధిలో ఈ యాత్ర పూర్తి అవుతుందని.. ఆ తరువాత పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై మరింత దృష్టి పెడతామని జనసేన కీలక నేత నాదెండ్ల అంటున్నారు.

పొత్తులపైనా క్లారిటీ

అన్ని రాజకీయ పార్టీలు పవన్ యాత్రలో పొత్తులపై ఎలాంటి స్పష్టత ఇస్తారు అనేదానిపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన దానికి కట్టుబడి ఉంటుందా లేక వేరే ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అని జనసైనికులు సైతం ఎదురు చూస్తున్నారు. నిజానికి గత కొంతకాలంగా పవన్ బీజేపీతో ఆంటీ ముంటనట్టుగానే ఉంటున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ వైఖరితో ఆయన అసహనం పాలయ్యారని జనసేన అంతర్గత నాయకులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం జనసేన దోస్తీ‌ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. యువతలో అపారమైన క్రేజ్ ఉన్న పవన్‌తో పొత్తు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు సైతం తమది జనసేనతో వన్ సైడ్ లవ్ అన్నట్టుగా చెబుతూ వస్తున్నారు. మరి పవన్ ఈ విషయంపైనా స్పష్టత ఇస్తారా? అన్నది చూడాలి.

ఒంటరిగా వెళతారా?

అసలు పొత్తులేవీ లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎలా వుంటుంది అన్న అభిప్రాయం కూడా జనసేన నేతల్లో ఉంది. 2019 ఎన్నికల్లో జరిగిన వైఫల్యాలు రిపీట్ కాకుండా పవన్ జనంలోనికి గనుక వెళితే ఆయనకున్న క్రేజ్ రెట్టింపు కావడంతో పాటు ఆశయాలను జనం ముందుకు మరింత ప్రభావితంగా తీసుకెళ్లవచ్చు అనే అభిప్రాయం కూడా విశ్లేషకుల నుంచి వెలువడుతున్నది.

నిశితంగా గమనిస్తున్న వైసీపీ

దసరా నుంచి జరుగబోతున్న పవన్ కళ్యాణ్ యాత్రను అధికార వైసీపీ నిశితంగా గమనిస్తున్నది. ఇప్పటికే వైసీపీ, జనసేనల ఆ మధ్య రాజకీయ పార్టీల మధ్య ఉండాల్సిన పోటీని దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయిందని సామాన్య జనం సైతం భావిస్తున్న నేపథ్యంలో దీనికి చెక్ పెట్టడంతో పాటు అసలు పవన్ ఈ యాత్ర ద్వారా ఎటువంటి ప్రభావం చూపబోతున్నారంటూ వైసీపీ సైతం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5 నుంచి జరగబోయే పవన్ యాత్ర ఎలాంటి పరిణామాల‌కు వేదిక అవుతుందో చూడాలి.

Advertisement

Next Story