టీచర్స్ ఎమ్మెల్సీ ఎవరు?..ఆ ఐదుగురి మధ్యే గట్టి పోటీ

by Javid Pasha |
టీచర్స్ ఎమ్మెల్సీ ఎవరు?..ఆ ఐదుగురి మధ్యే గట్టి పోటీ
X

దిశ, సిటీబ్యూరో : టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది. మూడు జిల్లాల్లో మొత్తం 29వేల 720 మంది ఓటర్లుండగా, వీరిలో దాదాపు 90.40 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చితే రాజకీయ ప్రమేయం బాగా తగ్గిన ఈ టీచర్స్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది. విజేత ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. బరిలో 21 మంది అభ్యర్థులున్నా, వీరిలో కేవలం ఐదుగురి మధ్య గట్టిపోటీ నెలకొందనే చెప్పవచ్చు. అభ్యర్థుల్లో కేవలం ఏవీఎన్ రెడ్డి ఒక్కరూ మాత్రమే తాను బీజేపీ అభ్యర్థినని స్వయంగా ప్రకటించుకోవటంతో పాటు పలు సందర్భాల్లో ఆ పార్టీకి చెందిన నేతలు సైతం ఆ విషయాన్ని పరోక్షంగా ధృవీకరిస్తూ ప్రకటనలు చేశారు. ఇక మిగిలిన వారిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చెన్నకేశవరెడ్డి, కాంగ్రెస్ బలపరిచ్చిన అభ్యర్థి హర్షవర్థన్ రెడ్డి, సీపీఎం, యూటీఎఫ్‌లు బలపర్చిన అభ్యర్థిగా మాణిక్ రెడ్డిలని ప్రచారం జరిగింది.

కానీ వాస్తవానికి పార్టీ కండువాలేసుకుని ప్రచారం చేసింది ఒక్క బీజేపీ మాత్రమే కాగా, ఏకంగా 90.40 శాతం ఓట్లు పోల్ కావటంతో ఎవరు విజేత అన్నది ఎవరూ సరిగ్గా అంఛనా వేయలేకపోతున్నారు. ప్రధాన పోటీ నెలకొందని చెప్పకుంటున్న అభ్యర్థుల్లో బీఆర్ఎస్ బలపర్చిన చెన్నకేశవరెడ్డి, కాంగ్రెస్ బలపర్చిన హర్షవర్దన్ రెడ్డి లిద్దరు మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారే. ఆ జిల్లాలో వారికి అత్యధికంగా ఓట్లు పడ్డాయన్న వాదనలున్నాయి. కానీ తక్కువ ఓట్లు, పోలైన ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న గద్వాల్ జిల్లాలో మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన వివిధ పార్టీలు బలపర్చిన అభ్యర్థే విజయం సాధించే అవకాశాలున్నట్లు పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీ అభ్యర్థి బలపర్చిన ఏవీఎన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలకు చెందినవారు కావటంతో రంగారెడ్డి జిల్లాలో జరిగిన పోలింగ్ శాతంలో ఆయనకు ఎక్కువ ఓట్లు పడే అవకాశమున్నా, మిగిలిన జిల్లాల్లో ఆయనకు మైనస్ అయినట్టేనన్న వాదనలు సైతం లేకపోలేవు. అత్యధిక సంఖ్యలో ఓటర్లు కల్గిన రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ శాతం కూడా ఆశాజనకంగానే జరగటం, బీజేపీ శ్రేణులు సహకరించటంతో ఏవీఎన్ రెడ్డి గెలుస్తారన్న వాదనలు లేకపోలేవు. ఇక ఏ పార్టీ బలపర్చని కాటేపల్లి జనార్థన్ రెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన టీచర్ అయినా ఆయనకు మేడ్చల్ మాల్కాజ్ గిరి జిల్లాలో ఎక్కువ మంది ఓటర్ల ఆదరణ దక్కిందన్న ఊహాగనాలు సైతం లేకపోలేవు. మొత్తానికి జిల్లాల వారీగా జరిగిన పోలింగ్ సరళిని గమనిస్తే ఈ సారి టీచర్ ఓటర్లు కాస్త లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యతనిచ్చినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాధాన్యత ఎవరి పక్షమో?

సాధారణ ఓటింగ్ కన్నా భిన్నంగా జరిగే పోలింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ. బరిలో ఉన్న అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకుని ఓటింగ్ చేస్తారు. వీటిలో ప్రాధాన్యత క్రమం 1,2,3 అంటూ అభ్యర్థులకు ఓటింగ్ చేస్తారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే కొనసాగే ప్రాధాన్యత ఎవరి పక్షాన నిలుస్తుందో వేచి చూడాలి. ఒక జిల్లాలో ఒక అభ్యర్థికి మెజార్టీ ఓట్లు పడ్డాయని, మరికొన్ని జిల్లాలో మరి కొందరు అభ్యర్థులకు ఓటింగ్ జరిగిందని భావించినా, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల మెజార్టీలు పైకి, కిందకు మారే అవకాశాలుంటాయి.

Advertisement

Next Story

Most Viewed