ఒంటిపూడ బడులు ఇంకెప్పుడు జగన్ రెడ్డి?: టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి

by Javid Pasha |
ఒంటిపూడ బడులు ఇంకెప్పుడు జగన్ రెడ్డి?: టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తన అసమర్థ పాలనతో విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యార్థుల సంక్షేమం, బాగోగులనూ గాలికొదిలేయడం దుర్మార్గం అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. మార్చి నెల ముగుస్తున్నా ఒంటిపూట బడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం ఒక్క రాజారెడ్డి రాజ్యాంగంలోనే సాధ్యమవుతోంది అని విమర్శించారు. ఎండలు మండిపోతుంటే హాఫ్ డే స్కూల్స్ పెట్టడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటో అర్ధం కావడంలేదన్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలవుతోందని అలాకాకుండా అందుకు విరుద్ధంగా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఒంటిపూట బడులు పెట్టడంలేదని ఆరోపించారు.

పైగా దీనిపై ప్రశ్నించిన ఉపాధ్యాయులపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటన్నారు. ఒంటిపూట బడులు పిల్లలకా? మీకా అంటూ మంత్రి చులకనగా మాట్లాడటం నీతిమాలినచర్య అన్నారు. ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో తిరిగే ముఖ్యమంత్రి, మంత్రులకు స్కూలు పిల్లల కష్టాలు ఏం తెలుస్తాయి? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఒక్క బడినైనా పూర్తిస్థాయిలో సందర్శించారా? పిల్లల ఇబ్బందులు తెలుసుకున్నారా? పట్టుమని పదిరోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమంటే అన్ని రోజులు మా వల్ల కాదని వైసీపీ నేతలు కళ్లు తేలేస్తారు అని మండిపడ్డారు. చిన్నపిల్లలు మాత్రం మండే ఎండల్లో రోజంతా స్కూళ్లలో ఉండాలా? ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయులపై కక్షసాధింపు ధోరణి పక్కనపెట్టాలి. విద్యార్థుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఒంటిపూట బడులు నిర్వహించాలి అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story