తెలుగు రాష్ట్రాల్లో జనసేనే బలమైన పార్టీ.. 119 పార్టీల్లో ఇదే టాప్!!

by GSrikanth |   ( Updated:2022-08-31 03:49:59.0  )
తెలుగు రాష్ట్రాల్లో జనసేనే బలమైన పార్టీ.. 119 పార్టీల్లో ఇదే టాప్!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని స్థానిక రాజకీయ పార్టీల్లో జనసేన ఆర్థికపరంగా బలమైన పార్టీగా నిలిచింది. అన్​రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల జాబితాలో మొత్తం 119 రాజకీయ పక్షాలు రాష్ట్రంలో ఉంటే.. వాటిలో 12 పార్టీలు తమ వార్షిక నివేదికలు అందించాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల రాజకీయ పార్టీల వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో కొన్ని పార్టీలు తమ వార్షిక నివేదికలు ఇవ్వడం లేదని నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో జాతీయ పార్టీలు 8, ప్రాంతీయ పార్టీలు 57గా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన, తెలంగాణ జన సమితి వంటి పార్టీలన్నీ అన్ రికగ్నైజ్డ్​ పార్టీలుగానే ఈసీ పేర్కొంది. ఇందులో జనసేనకు గాజు గ్లాసు గుర్తును కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ జన సమితికి మాత్రం గుర్తును పేర్కొనలేదు. ఫ్రీ సింబల్స్ నుంచి గుర్తును తీసుకునేందుకు అవకాశం ఉంటోంది. 2018లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 77 రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్​పార్టీలు పోటీ చేసినట్లు ఈసీ పేర్కొంది. తెలంగాణ జనసమితి, ఇంటిపార్టీ, యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజాపార్టీ, యువశక్తి, యువ పార్టీ, మైనార్టీ ఓబీసీ రాజ్యం, తెలంగాణ కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్ ఇండియా, శివసేన, సమాజ్​వాది ఫార్వర్డ్ బ్లాక్, రాష్ట్రీయ జనతాదళ్, లోక్ సత్తా, మన పార్టీ, అన్నా వైఎస్సార్ వంటి పార్టీలన్నీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. అదే విధంగా 2019 జనరల్​ఎన్నికల్లో 35 పార్టీలు పోటీలో ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. జనసేన, తెలంగాణ జన సమితి, తెలంగాణ యువశక్తి, సమాజ్​వాది ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీలు 35 పోటీలో ఉన్నాయి.

జనసేన రిచ్​

తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ధనవంతమైన రాజకీయ పార్టీగా నిలిచింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు విరాళాల రూపంలో రూ.26.37 కోట్లు వచ్చాయి. గతేడాది వరకు రూ. 22.36 కోట్లుగా ఉన్న జనసేన పార్టీ ఆదాయం ఈ ఏడాది రూ. 26.37 కోట్లకు పెరిగింది. అయితే, ఇప్పటి వరకు పార్టీ నిర్వహణకు రూ. 20.28 కోట్లు ఖర్చు అయ్యాయని, 2020 వరకు రూ. 14.35 కోట్లుగా ఉన్న ఖర్చు.. 2021లో భారీగా పెరిగిందని రిపోర్టులో పేర్కొన్నారు. జనసేన పార్టీకి భవనాల రూపంలో రూ. 1.01 కోట్లు, వాహనాలు రూ. 66.37 లక్షలు, ఆఫీస్​ఎక్విప్​మెంట్ ద్వారా రూ. 56.34లక్షలు, ఇన్సురెన్సుల ద్వారా రూ.95.47 లక్షల ఆదాయం ఉందని, ప్రస్తుతం బ్యాంకులో రూ.7.60 కోట్లు నిల్వ ఉన్నట్లు ఆదాయ వివరాల్లో చూపించారు. ఈ పార్టీకి 2021లో రూ. 3.87 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. ఈ పార్టీకి విరాళాలుగా 1.57 లక్షలు, మెంబర్ షిప్​ద్వారా రూ. 1.08 కోట్లు, ఫిక్సడ్​డిపాజిట్ల నుంచి రూ. 82.68 లక్షలు, ఇతర మార్గాల ద్వారా రై. 1.94 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ జనసేన పార్టీకి 2020 ఆర్థిక సంవత్సరంలో విరాళాల ద్వారా రూ. 4.98 కోట్లు వచ్చాయి. ఫిక్స్‌డ్​డిపాజిట్ల రూపంలో రూ. 53.37 లక్షలు, ఇతర మార్గాల ద్వారా రూ. 2.28 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. 2020 వార్షిక సంవత్సరంలో జనసేన పార్టీ దగ్గర రూ.7.81 కోట్లు ఉంటే.. 2021లో రూ. 3.87 కోట్లు ఉన్నాయి. అయినప్పటికీ స్థానిక పార్టీలో ఈ పార్టీ మాత్రమే ధనవంతమైనా పార్టీగా నిలిచింది.

లోక్ సత్తా ఆస్తి రూ. 26.13 లక్షలు

లోక్​సత్తా పార్టీ దగ్గర రూ. 26.13 లక్షల ఆస్తి ఉందని, బ్యాంకు ఖాతాలో రూ.6.86 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే, గతంలో ఫారిన్​ఫండ్స్ వచ్చినట్లుగా చూపించిన లోక్ సత్తా, సోషల్ జస్టిజ్​ పార్టీ 2021 ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూపాయి రాలేదని వెల్లడించింది. విరాళాల ద్వారా రూ. 3.39 లక్షలు వచ్చినట్లు రిపోర్ట్‌లో చూపించారు. తమ ఆదాయంలో గతేడాది ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసినట్లుగా లోక్​సత్తా పార్టీ వెల్లడించింది.

మొత్తం 12 పార్టీలు

రాష్ట్రంలోని అన్ రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలు 119 ఉండగా.. వాటిలో 12 పార్టీలు మాత్రమే ఆదాయ, వ్యయ వివరాలు ఇచ్చాయి. సోషల్ జస్టీస్ పార్టీ, లోక్ సత్తా, జనసేన, ఎంఐఎం, ఆల్ ఇండియా సమతా పార్టీ, బీసీ యునైటైడ్​ ఫ్రంట్, బహుజన రాజ్యం, నవ సమాజ్ పార్టీ, సకల జనుల పార్టీ, సమాజ్​వాది ఫార్వార్డ్ బ్లాక్, శ్రమజీవి పార్టీ, తెలంగాణ లేబర్​పార్టీలు లెక్కల వివరాలు సమర్పించాయి. గత ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన సమాజ్​వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఈసారి ఆదాయం, వ్యయం లేదని రిప్లై ఇచ్చారు.

107 పార్టీల నుంచి నో రిప్లై

2017 నుంచి రాష్ట్రంలోని 119 రాజకీయ పార్టీలు తమ ఆదాయ వివరాలు సమర్పించడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వాటికి గతంలోనూ పంపించిన నోటీసులకు రిప్లై రాలేదని, దీంతో వాటిపై అనర్హత వేటు వేస్తామని ఈసీ మే నెలలో నోటీసుల్లో హెచ్చరించింది. రిప్లై కోసం కేవలం నెల రోజులు మాత్రమే వ్యవధి ఇచ్చింది. ఆ తర్వాత జూలై నెలాఖరు వరకు సమర్పించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్​పొలిటికల్ పార్టీలుగా ఉన్న 119కి ఆదాయ వివరాలు చెప్పాలని సూచించారు. పార్టీకి ఆదాయం ఎలా వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారని, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వారి పాన్​ కార్డు, ఆధార్​ కార్డు, పార్టీ బ్యాంకు ఖాతా వివరాలన్నీ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈసీ నుంచి నోటీసులు ఇచ్చిన పార్టీలో జనసేన, తెలంగాణ జన సమితి, లోక్ సత్తా, తెలంగాణ ఇంటిపార్టీ, నవ తెలంగాణ, ప్రజాశాంతి, తెలంగాణ తల్లి, సమాజ్​వాదీ ఫార్వర్డ్ బ్లాక్, జై స్వరాజ్, జనరాజ్యం, మన తెలంగాణ వంటి పార్టీలున్నాయి. కానీ, నోటీసులు అందుకున్న 12 పార్టీలు మాత్రమే వివరాలిచ్చాయి. మిగిలిన పార్టీల నుంచి రిప్లై ఇవ్వలేదు. దీంతో వాటిపై ఈసారి చర్చలు తీసుకునే అవకాశం ఉందని ఎన్నిక కమిషన్ వర్గాలు చెప్తున్నాయి.

Also Read : భారతీయుల సమైక్యతకు ఆలంబన వినాయక చవితి: పవన్ కల్యాణ్

Advertisement

Next Story