- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊర్లలో చిచ్చు రేపుతోన్న ఆ ఖర్చు.. మునుగోడులో సర్పంచ్‌లకు కొత్త టెన్షన్!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు మునుగోడు ప్రతిష్టాత్మకం. ఒకరికి మించి ఇంకొకరు ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చులు ఊర్లల్లో చిచ్చు రేపుతున్నది. ఏడు మండలాల్లో పార్టీలు పంపిణీ చేస్తోన్న డబ్బులే వివాదాలకు కారణం అవుతున్నది. పొరుగు జిల్లాలు, నియోజకవర్గాలకు చెందిన నేతలను ఇక్కడి మండలాలకు ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించారు. వారేమో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులకు ఇచ్చే దాంట్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని మండలాల్లో అది ఒక్కొక్కరి నుంచి 10 నుంచి 20 శాతం దాకా ఉండడం గమనార్హం. బహిరంగ సభలు, సమావేశాలకు ఖర్చులంటూ చేతిలో పెట్టినట్లే పెట్టి అందులో కోత విధించారు. పెద్ద నాయకుడేమో రూ. 2 లక్షలు, రూ.లక్ష అని కోడ్ భాషలో మెసేజ్ పంపాడు. ఇంటికొచ్చి కవర్ విప్పి చూస్తే నోట్లు తక్కువాయే. అయ్యో ఇస్తామన్న దాంట్లోనే కట్ చేసి ఇస్తే మిగతా ఖర్చులు ఎవరు భరించాలంటూ మొత్తుకుంటున్నారు. దానికి తోడు ఇన్‌చార్జీలుగా వచ్చిన వారికి స్థానిక కార్యకర్తలు, నాయకుల వ్యక్తిత్వం అంచనా వేయకుండా ఎవరికి ఎంత ఇచ్చాం అన్న విషయాన్ని లీక్ చేస్తున్నారు. రహస్యంగా ఉంచాలన్న అంశాన్ని కార్యకర్తలకు కూడా తెలియడంతో ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటూ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులను కార్యకర్తలు బద్నాం చేస్తున్నారు.
= అన్నా.. వచ్చినయంట కదా
= అన్నా.. మీటింగ్‌కు డబ్బులు వచ్చినయంట కదా.. మరి మా వాటా ఏం లేదా? నేను కూడా జనాన్ని తీసుకొస్తున్న కదా అంటూ కొందరు..
= ఏం సర్పంచ్ సాబ్.. ఇంకేంది? పైసలొచ్చినయ్ కదా. మన మండల ఇన్‌చార్జ్ చెప్పిండు. బాగానే ఇచ్చిర్రట కదా.. మరి దావత్ ఏం లేదా? ఎంత మందిని తీసుకురావాలి? అంటూ మరికొందరు.
ఇంకొందరేమో లీడర్ పైసలిస్తే ఇంట్ల మూట గట్టుకొని పెట్టుకున్నడంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. వాళ్లను ఒప్పించలేక డబ్బులు తీసుకున్న సర్పంచులకు తలనొప్పి వస్తుంది. తాను సభకు రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టిన. నాకు ఇచ్చిందేమో రూ.2 లక్షలు. అందులో రూ.20 వేలు మండల ఇన్‌చార్జ్ మింగేసే. దానికి తోడు ఇచ్చిన అమౌంట్ ఎంతో అందరికీ చెప్పే. నా వెంట జనాలు పడుతుంటే ఏం చేయాలి? వాళ్లకు నచ్చజెప్పలేక చస్తున్న అని ఓ సర్పంచ్ 'దిశ'కు చెప్పారు. రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని ఎక్కడి నుంచో వచ్చిన మండల ఇన్‌చార్జీలు కార్యకర్తలందరికీ చెబితే ఇక మేం పార్టీ కార్యక్రమాల్లో పని చేసేదెట్లా? అని ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలోని చాలా మంది సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులు ఎదుర్కొంటున్నదేనన్నారు. ఆఖరికి పార్టీ గ్రామ శాఖలకు ఇచ్చిన అమౌంట్‌లోనూ కోత పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఏ పార్టీ ఎంత ఫండ్ ఇచ్చిందో.. ఎవరికెంత పంపిణీ చేశారు? ఎంత ఖర్చు పెట్టారు? లెక్కలు తీయకపోతే ఓటర్లకు చేరకముందే దొంగల పాలయ్యే అవకాశం ఉన్నదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
మింగేస్తున్న బాధ్యులు
గెలుపే లక్ష్యంగా, అన్ని గ్రూపులను సమన్వయం చేయడానికి మండల ఇన్ చార్జీలుగా నియమిస్తే కొందరు ఈ చార్జ్‌లు వసూలు చేస్తున్నారని పార్టీ నాయకులు మదనపడుతున్నారు. ఇక్కడ కూడా పార్టీ ఫండ్‌ను కాస్త కూడబెట్టుకునే పనిలో పడడం విమర్శలకు తావిస్తున్నది. రాక రాక ఉప ఎన్నికలొస్తుంటే ఖర్చులకైనా రాకపోతాయా? అని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. మధ్యలో ఈ కోత విధిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఓటుకు రూ.20 వేల దాకా పలుకుతుందన్న నేపథ్యంలో ఆదిలోనే మధ్యవర్తులు, లీడర్లు చేతివాటం ప్రదర్శిస్తుండడంతో ఓటర్లకు ఎంత వరకు అందుతాయోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అభ్యర్థులు, పార్టీల అధిష్ఠానాలు ఖర్చు పెట్టినా ఓటరు దాకా చేరుతాయా? లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Also Read : మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తోన్న వేళ.. కేసీఆర్‌కు బిగ్ షాక్
Also Read : మునుగోడులో బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా నేతల కదలికలు