- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా మాటే శాసనం.. హిందూపురంలో రాజ్యమేలుతున్న పీఏలు
దిశ, అనంతపురం: హిందూపురం నియోజకవర్గంలో పీఏల హవా రాజ్యమేలుతోంది. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల పీఏలు "చెప్పిందే వేదం.. చేసిందే శాసనం" అన్నట్లుగా నడుస్తోంది. వీరి హవా ఎంతలా ఉందంటే పార్టీలు కష్టనష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటి నడిచిన పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తల మాటలు, సలహాలు, సూచనలు ఇక్కడ ఏమాత్రం పని చేయవు. వీరు ఏమి చెప్పినా నియోజకవర్గ అధిష్టానానికి చెవికి ఎక్కవు. అటు పార్టీలోనూ ఇటు అధికారులలోనూ పీఏ ఏమి చెబితే అదే చెల్లుబాటు అవుతుంది. వీరు ఎంతలా తయారయ్యారంటే పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ నాయకులు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కిక్కురు మనకుండా ఉండాల్సిన పరిస్థితి దాపురించేలా చేస్తున్నారు. తాజాగా హిందూపురంలో ఉన్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పీఏ గోపికృష్ణ నిర్వాకమే ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ.. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పీఏ.. ఏది చెబితే అది నియోజకవర్గంలో జరగడం గమనార్హం. నియోజకవర్గంలో ఉన్న అధిష్టానానికి వీరు ఏమీ చెబితే అదే వేద వాక్కుఅయింది. పార్టీకి చెందిన నాయకులు గానీ, కార్యకర్తలు కానీ, అధికారులు కానీ ఏమి చెప్పినా నియోజకవర్గ అధిష్టానం మాత్రం వీరివైపు చూస్తుంది. నియోజకవర్గ అధిష్టానానికి కావాల్సిన 'సమస్తమూ' వీరు అమర్చి వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని రాజ్యాన్ని నడిపిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతిదీ వీరు చెప్పినట్లే జరిగేలా చూసుకుంటూ పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో శనివారం అఖిలపక్ష పార్టీల నాయకులు అందరూ సమావేశమై ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌ను నియోజకవర్గంలోని రాకుండా చూస్తామనే స్థాయికి వెళ్లారంటే ఆయన పీఏ గోపికృష్ణ నిర్వాకం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
వారి మాటే శాసనం
హిందూపురం నియోజకవర్గంలో పీఏల మాటే చెల్లుబాటు అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2014లో హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ శేఖర్ సాగించిన హవా అంతా ఇంతా కాదు. పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ పక్కన పెట్టి ఆయన ఏమి చెబితే అదే శాసనంగా చెల్లుబాటు అయింది. తాజాగా ఎమ్మెల్సీ పీఏ గోపికృష్ణ సాగించిన వ్యవహారం కూడా ఆయనకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఈయన ఆయన కన్నా ఒక ఆకు ఎక్కువగా హత్యా రాజకీయాలకు తెర లేపడం గమనార్హం. ఒక అనామక వ్యక్తిగా ఉన్న ఆయన ఎమ్మెల్సీ పంచన చేరిన తరువాత నియోజకవర్గంలో పార్టీని, అధికారులను తన చెప్పు చేతుల్లో పెట్టుకుని తాను ఏమి చెబితే అదే చెల్లుబాటు అయ్యేలా చేసుకున్నాడన్న ప్రచారం ఉంది. అక్కడ ఎమ్మెల్సీని ఒక డమ్మీగా మార్చివేసి సర్వం తానే అన్నట్లుగా కథ నడిపించి చివరకు కటకటాల పాలవడం గమనార్హం. చిన్నచిన్న పంచాయితీలు మొదలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, దందాలు... చివరకు అధికారుల పోస్టింగులలో సైతం ఇతని మాటే చెల్లబాటు అయిందన్న ప్రచారం ఉంది. ఇతని మాటలను, సలహాలను గుడ్డిగా నమ్మిన ఎమ్మెల్సీ ప్రస్తుతం నియోజకవర్గంలోకి రావడానికి సైతం వెనుకాడుతూ ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది.
నాడు ఎమ్మెల్యే .. నేడు ఎమ్మెల్సీ ..
2014లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏగా పనిచేసిన శేఖర్ చేసిన నిర్వాకాన్ని ఇప్పటికీ నియోజకవర్గంలో కథలు, కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో ఆయన మాటే వేద వాక్కుగా చలామణి అయింది. దీంతో తనకు ఎదురులేదని భావించిన అతను పార్టీ ముఖ్య నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టి పెద్ద ఎత్తున దందా నడిపించారు. ప్రతి పనికి డబ్బులు దండుకున్నారు. ఎవరైనా డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగితే బాలకృష్ణకు, ఆయన భార్యకు కూడా వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని బహిరంగంగానే చెప్పేవాడు. ప్రతి పనికి, బదిలీకి ఇంత రేటు అని ఫిక్స్ చేసి మరీ దోచుకున్నాడన్న అపప్రధ మూట కట్టుకున్నారు. ఆఖరికి పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా లంచం ఇస్తేనే పనులు, బదిలీలు కావాలన్నా డబ్బులు ఇచ్చుకోవలసిందే. దీంతో అప్పట్లో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. తాజాగా ఎమ్మెల్సీ పీఏ వ్యవహారం కూడా ఆయనకు ఏమాత్రం తీసిపోకుండా జరుగుతోందని పార్టీలోనూ, ప్రజల్లోనూ ప్రచారం జరుగుతోంది. ఆయన ఏమి చెబితే అదే ఎమ్మెల్సీ వింటారన్న ప్రచారం సైతం జోరుగా సాగింది. ఆఖరుకు పలుమార్లు నియోజకవర్గంలోని నాయకులు అందరూ ఏకమై ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. దీంతో నాయకులందరూ ఏమి మాట్లాడకుండా కిక్కురుమనకుండా ఉండిపోయారు. చివరకు హత్యా రాజకీయాలకు సైతం తెరలేపిన ఎమ్మెల్సీ పీఏ ప్రస్తుతానికి జైలులో ఊచలు లెక్కబెడుతూ ఉన్నారు. ఇలా నాడు ఎమ్మెల్యే.. నేడు ఎమ్మెల్సీ పీఏల మాటలు, సలహాలను పాటించి నెత్తి మీదకు తెచ్చుకున్నారు.
పెడచెవిన పెడుతోన్న నేతల మాటలు
వీరి మాటలను నమ్మిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పార్టీ కోసం కష్టపడిన నాయకులను, కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టి వేశారన్న ప్రచారం ఉంది. దీంతో పాటు పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించిన వీరిపైనే కేసులు పెట్టి వేధించారన్న ప్రచారం కూడా వీరిపై ఉంది. వీటన్నింటితో పాటు వీరి మాటలను నమ్మి పీఏల చెప్పు చేతల్లో కీలుబొమ్మలుగా మారిపోయి పార్టీ పరువును గంగలో కలిపి వేశారన్న ప్రచారం సాగింది. దీంతో నాడు తెలుగుదేశం హయాంలోనూ నేడు అధికార పార్టీలోనూ నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకమై పీఏల అవినీతి, అక్రమాలు, అధికార దాహాల గురించి పలు వేదిక లపై బహిరంగంగానే మాట్లాడుతూ ఉండడం గమనార్హం. వీరి వ్యవహార శైలి వల్ల పార్టీ పరువు మంట కలిసిపోతూ ప్రజల్లో పార్టీ పట్ల చులకన భావం ఏర్పడినప్పటికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లలో కనీసం చలనం కూడా లేకుండా ఉందన్న ప్రచారం ఆయా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.