AP Politics: అంతా లోకేశ్ కనుసన్నల్లోనే.. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోస్టింగ్‌ల భర్తీ?

by Indraja |   ( Updated:2024-06-21 05:14:18.0  )
AP Politics: అంతా లోకేశ్ కనుసన్నల్లోనే.. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోస్టింగ్‌ల భర్తీ?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో అత్యంత కీలకమైన జిల్లాగా భావించే ఉమ్మడి విశాఖలో కీలకమైన అధికారుల పోస్టులన్నీ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ కనుసన్నల్లోనే జరుగనున్నాయి. విశాఖలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు చేసిన వేల కోట్ల అక్రమాలు, కబ్జాలు, విధ్వంసాలను దృష్టిలో వుంచుకొని వాటిపై చర్యలు, పునరుద్ధరణ కోసం జిల్లా ఇన్చార్జి మంత్రిగా నారా లోకేశ్‌ను నియమించాలనే నిర్ణయం తీసుకొన్నారు.

ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేశాకే..

దీంతో నారా లోకేశ్ కనుసన్నల్లోనే రెవెన్యూపరంగా ఆర్డీవోలు, ఎంఆర్వోలు, పోలీసుల పరంగా డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, జీవీఎంసీ‌లో జోనల్ కమిషనర్లు, ఏసీపీలు, యూసీడీ పీడీ వంటి పోస్టులను భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. శాసనసభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసి మరీ నియామకాలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది.

ప్రజాప్రతినిధుల చుట్టూ పైరవీకారులు..

అయితే, విచిత్రంగా ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి పక్షాల ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన, కోట్లలో సంపాదించిన వివాదాస్పద అధికారులంతా తెగ తిరిగేస్తున్నారు. కులం కార్డు, లంచం కార్డు, ప్రాంతం కార్డు ప్రయోగిస్తూ వారిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో వున్న కొందరు నేతలు కూడా అధికారుల గుణగణాలు, పార్టీ లాయల్టీలు, అవినీతి అక్రమాల వంటివి చూడకుండా వారికే హామీలిచ్చేస్తున్నారు.

ఒక ఎంపీ, సీనియర్ ఎమ్మెల్యేతోనే తంటా..

బయట ప్రాంతంనుంచి వచ్చిన ఒక ఎంపీ, మరో సీనియర్ ఎమ్మెల్యే ఏరికొరి అత్యంత అవినీతి పరులైన అధికారులకు ఫోన్‌లు చేసి మరీ తమ దగ్గరకు రప్పించుకోవడం ఇప్పుడు కూటమి నేతలను కలవర పరుస్తోంది. వైసీపీ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు విసిగిపోయి ఉమ్మడి విశాఖ ప్రజలు భారీ మెజారిటీలతో ఏకపక్షతీర్పు ఇస్తే గెలిచిన పక్షం రోజులకే అవినీతి అధికారులకు వీరు వంతపాడుతూ బేరాలు మొదలెట్టేయడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది.

వ్యూహాత్మకంగా ఇందులో ఒకరు బెదిరింపులతో భయపెడుతుండగా మరొకరు సర్దుబాటు చేస్తానంటూ బేరాలకు దిగుతున్నారని కూటమి నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అన్ని పోస్టులు చంద్రబాబు, పవన్, లోకేశ్‌ల ఆమోదంతో భర్తీ అయితేనే బెటరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read...

BREAKING: ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రమాణం.. శపథం నెరవేరిందన్న టీడీపీ శ్రేణులు

Advertisement

Next Story

Most Viewed