నావన్నీ లాక్కున్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్

by Javid Pasha |
నావన్నీ లాక్కున్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్
X

ముంబై: ఎలక్షన్ కమిషన్‌ను రద్దు చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. తనకున్నవన్నీ లాక్కున్నారని ఆరోపించారు. శివసేన పార్టీ పేరును, గుర్తును రెబల్ నేత ఎక్‌నాథ్ షిండే వర్గానికి ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. ఇదంతా ప్లాన్ ప్రకారం కుట్ర చేశారని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నారు. 'ఎలక్షన్ కమిషన్‌ను రద్దు చేయాలి. ఎన్నికల కమిషనర్లను ప్రజలు ఎన్నుకోవాలి. పార్టీ ఫండ్స్ గురించి మాట్లాడే హక్కు ఎన్నికల కమిషన్‌కు లేదు. ఎవరు ఏమి పొందాలో అది నిర్దేశించలేదు' అని ఠాక్రే చెప్పారు.

ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయంపై తన అనుచరులు సుప్రీం కోర్టుకు వెళతారని ఆయన అన్నారు. ఈ అంశం మంగళవారం విచారణకు వస్తుందని ఠాక్రే చెప్పారు. 'దీన్ని ఇంతటితో ఆపకపోతే దేశమంతటా ఈ అరాచకానికి ఇక్కడే బీజం పడినట్టవుతుంది. 2024 ఎన్నికలు మహారాష్ట్రలో చివరి ఎన్నికలవుతాయి' అని ఠాక్రే హెచ్చరించారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలు, మద్దతుదారులతో ఠాక్రే సోమవారం సమావేశమయ్యారు. శివసేన పార్టీ తమదే అని దాని గుర్తు కూడా తమకే కేటాయించాలని గత శుక్రవారం షిండే వర్గాలు ఎన్నికల కమిషన్‌ను కోరాయి.

అయితే శివసేన (ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాక్రే-యుబిటి) పేరును ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఉపయోగించుకుంటోంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి వెలుగుతున్న టార్చ్ గుర్తును ఎన్నికల కమిషన్ గతేడాది కేటాయించింది. 'నాకున్నవన్నీ దోచుకున్నారు. పేరు, పార్టీ గుర్తు దోచుకోవచ్చేమో కానీ ఠాక్రే పేరును ఎవ్వరూ దొంగిలించలేరు. శివసేనను అంతమొందించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఆ కుట్రలో భాగంగానే పార్టీ పేరును, గుర్తును దోచుకున్నారు' అని మాజీ సీఎం అన్నారు.


Advertisement

Next Story

Most Viewed