మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి.. మంత్రికి తలనొప్పిగా మారిన వైనం..

by Mahesh |   ( Updated:2022-08-10 09:51:08.0  )
మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి.. మంత్రికి తలనొప్పిగా మారిన వైనం..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అధికార టీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. రాజీనామా నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యం కావడం.. టికెట్ రేసులో స్థానిక నేతలంతా ఇబ్బడిముబ్బడిగా వచ్చేయడం.. టీఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. వాస్తవానికి మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్‌లో గత కొంతకాలంగా వర్గపోరు ముమ్మరంగా సాగుతోంది. దీనికి తోడు తాజాగా ఉప ఎన్నిక రావడం.. ఆశావాహుల్లో కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు వినిపిస్తుంటే.. మరోవైపు బీసీ నేతకే టికెట్ కేటాయించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మునుగోడు ఉపఎన్నిక టికెట్ వ్యవహారం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కి తలనొప్పిగా మారిందనే చెప్పాలి. మరీ పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.

కూసుకుంట్లకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశం..

మునుగోడు ఉపఎన్నికలో టికెట్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇవ్వొద్దంటూ ఇప్పటికే స్థానిక నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వనస్థలిపురంలోని ఓ హోటల్‌లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యతిరేక వర్గమంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాలనే గట్టి నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఆయన తీరు పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, సొంత టీఆర్ఎస్ పార్టీలోనే గ్రూపులు తయారయ్యయనే వాదనలు వినిపించాయి. కానీ జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు.. కూసుకుంట్ల వైపు మొగ్గు చూపిస్తుండగా.. స్థానిక నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది స్థానిక నేతలకు సదరు కీలక నేత నేరుగా ఫోన్‌లో బుజ్జగింపులు ప్రారంభించారు. కానీ ఈ నేతలంతా ససేమిరా అంటుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

జంప్ జిలానీలు పెరిగే అవకాశం..

మునుగోడు ఉపఎన్నిక టికెట్ రేసులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కర్నాటి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్, నారబోయిన రవి, కంచర్ల కృష్ణా రెడ్డి, ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత మారయ్య గౌడ్ తదితరుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టికెట్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలంటూ టీఆర్ఎస్‌లోని టికెట్ ఆశిస్తోన్న బీసీ నేతలంతా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే వీరిని కాదని.. టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి కేటాయిస్తే.. బీసీ నేతలు సహకరించే పరిస్థితి లేదనేది స్పష్టమవుతోంది. ఇదిలావుంటే.. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ బీజేపీ టచ్‌లోకి వెళ్లింది. కీలకంగా వ్యవహారించే ప్రజాప్రతినిధులకు ఆఫర్లను సైతం ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గన్నంతా టీఆర్ఎస్ దూరం చేసుకుంటుందా..? లేదా..? ఏం స్ట్రాటజీ అమలు చేస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.

బీసీ క్యాండేట్‌కు ఇస్తేనే బెటర్..

వాస్తవానికి ఉపఎన్నిక ప్రస్తావన వచ్చిన నాటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో బీసీ క్యాండిడేట్‌కు టికెట్ కేటాయించాలనే డిమాండ్ ప్రతి పార్టీ నుంచి వినిపించింది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీలో ఆ డిమాండ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. మునుగోడు నియోజకవర్గం మొత్తం ఓటర్లలో బీసీల ఓట్లే అత్యధికంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లోనూ ఇదే స్థాయి భావన పెరిగిపోయింది. దీంతో రాజకీయ పార్టీల్లోనూ ఇప్పటికే క్యాండిడేట్ ఎంపికపై స్పష్టతకు వచ్చారని, బీసీ క్యాండిడేట్‌కు కేటాయిస్తేనే బెటర్ ఫలితం ఉంటుందనేది రాజకీయ వర్గాల వాదన. మరీ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయో వేచి చూడాల్సిందే.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన అప్పుడే.. దామోదర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed