ఖాళీగా లేడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో చేసేది ఇదే!

by GSrikanth |   ( Updated:2022-09-26 23:30:45.0  )
ఖాళీగా లేడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో చేసేది ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ పార్టీ ఏర్పాటుపై గులాబీ బాస్ డైలామాలో పడ్డారు. దసరాకే పార్టీ ప్రకటన అని పార్టీ నేతలతో లీకులు ఇచ్చినప్పటికీ దానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. జాతీయపార్టీ అనేది అంతాతూచేనా అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ జాతీయ పార్టీకి కొంతమందిని ప్రతినిధులుగా నియమించిన తర్వాతనా? లేకుంటే ముందస్తుగానే పార్టీని ప్రకటించి ఆయా రాష్ట్రాల పర్యటనకు వెళ్లాలా అనేదానిపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఫాం హౌజ్‌లో ప్రతి రోజూ పార్టీలోని సీనియర్ నేతలతో జాతీయ పార్టీపై చర్చిస్తున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలా అనేదానిపై సుదీర్ఘంగా మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దసరాకు కేసీఆర్ ఏర్పాటు చేయబోయే పార్టీ ప్రకటన లేనట్లే. పార్టీ ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. దసరాకు మరోవారం రోజులు మాత్రమే ఉండటం, ఇప్పటివరకు పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదు. పార్టీ ఏర్పాటు తధ్యమని, బీజేపీ కేంద్రంలో అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణవైపు అన్ని రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి దేశమంతా కావాలని కోరుకుంటున్నారని అందుకు డిమాండ్లు సైతం వస్తున్నాయని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ దిశగా కసరత్తు సైతం ప్రారంభించారు. కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సైతం జాతీయ పార్టీ అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన బాధ్యతలను నేతలకు అప్పగించారు. మరోవైపు పార్టీలోని సీనియర్ నేతలతో మంతనాలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అంతేగాకుండా పార్టీ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని తీర్మానం సైతం చేయించారు. తామంతా కేసీఆర్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. కానీ నెలరోజులు గడుస్తున్నా జాతీయ పార్టీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

డైవర్షన్ పాలిటిక్స్ కోసమా?

కేసీఆర్ అసలు జాతీయ పార్టీని ప్రకటిస్తారా? లేకుంటే ప్రజల్లో ఉన్న అసమ్మతి, మరోవైపు లిక్కర్ స్కాంలో కవిత ఉందని వస్తున్న ఆరోపణలను పోగొట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? అనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు జాతీయ పాలిటిక్స్ అంశం లేవనెత్తుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. టాఫిక్ డైవర్షన్ కోసమే కేసీఆర్ ది న్యూస్కెచ్ అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన రైతుసంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం అభివృద్ధి చేస్తున్న కృషిని, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, రుణమాఫీ పథకాలను ఆయా రాష్ట్రాల్లో వివరించాలని సూచించారు. అంతేకాదు వారిని రాష్ట్రంలోని పలు జిల్లాల పర్యటనకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో చూపించారు. అదే విధంగా మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, తేజస్వీ యాదవ్, దేవేగౌడ, అఖిలేష్ యాదవ్, శరద్ పవర్, నితీష్ కుమార్, కుమారస్వామితో పాటు వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. కానీ, వారి నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రాలేదని విశ్వసనీయ సమాచారం. భారతీయ రాష్ట్ర సమితి పేరు ఖరారైందని.. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైందనే వార్తలు వచ్చాయి. తర్వాత కొత్త పార్టీ కాదు కొత్త కూటమి దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వచ్చింది. వాటన్నింటికి పుల్ స్టాప్ పడ్డట్లయింది. అందుకే కేసీఆర్ ఆచితూచీ వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రాల పర్యటన తర్వాతే పార్టీ ప్రకటన

జాతీయ పార్టీపై కేసీఆర్ కసరత్తును ముమ్మరం చేశారు. ప్రతి రోజూ పార్టీ సీనియర్ నేతలతో ఫాం హౌజ్‌లో ఉన్న కేసీఆర్ చర్చిస్తున్నారు. అయితే, పార్టీ పెడితే ఆయా రాష్ట్రాల్లో ప్రతినిధులు ఎవరు ఉండాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రతినిధులు లేకుండా పార్టీ ప్రకటన సాధ్యం కాదని, అందుకే అన్ని రాష్ట్రాల్లో మరోమారు పర్యటించి ప్రతినిధులను సెలక్టు చేసిన తర్వాతనే పార్టీని ప్రకటించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు పార్టీని ప్రకటించి రాష్ట్రాల పర్యటనకు వెళ్లి అప్పుడు పార్టీ ప్రతినిధులను నియమించేలా ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రజల ముందుకు వెళ్లిన మాదిరిగానే జాతీయ పార్టీని ప్రకటించి దేశ ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీలోని ఓ కీలక నేత ఒకరు తెలిపారు. అయితే పార్టీ ప్రకటన ఎప్పుడు అనేది మాత్రం సందిగ్ధం నెలకొంది.

కేసీఆర్‌కు పార్టీ కలిసివచ్చేనా?

కేసీఆర్ పెట్టబోయే జాతీయపార్టీకి కలిసి వస్తుందా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఆదిలోనే హంసపాదులా మారుతోంది. బీజేపీ ముక్త భారత్ నినాదంతో జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గులాబీ బాస్. ఈ తరణంలోనే హర్యానలో ఈ నెల 25న జరిగిన భారత మాజీ ఉపప్రధాని దేవీలాల్ జయంతిలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జెడీ చీప్ లాలూప్రసాద్ యాదవ్‌‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ప్రాంతీయపార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సభలో నితీష్ కుమార్ థర్డ్ ప్రంట్ ఆవసరం లేదని, 2024లో బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, లెప్ట్ పార్టీలతో సహా బీజేపీయేతర పార్టీలన్నీ ప్రధాన ఫ్రంట్‌గా ఏర్పడాలని పిలుపు నిచ్చారు. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సెప్టెంబర్ మొదటివారంలోనూ ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, NCP నేత శరద్ పవార్, వామపక్షాల నేతలను నితీష్ కుమార్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలు హాట్ టాఫిక్‌గా మారాయి బీహార్‌లోని జేడీయూ ఆర్జేడీ మహాకూటమిలాగే కేంద్రంలో మహాకూటమి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ ఏర్పాటు చేయబోయే పార్టీకి వారి మద్దతు ఎలా సాధ్యమనేది ప్రశ్నార్ధకంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed