- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూర్తిగా మొదటికొచ్చిన వ్యవహారం.. వైసీపీ, టీడీపీలకు కేంద్రం భారీ షాక్
దిశ, ఏపీబ్యూరో: విభజన హామీల్ని కేంద్రంతో అమలు చేయించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్న కారణంతో తనకు మెజారిటీ ఇమ్మని కోరి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌కు వరుస షాకులు తప్పడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయాన్ని ఎప్పుడో పక్కనబెట్టేసిన కేంద్రం, ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ పైనా చేతులెత్తేయడంతో జగన్ ఇరుకునపడ్డారు. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో జగన్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు అండ్ కో ఆశలకు కేంద్రం గండి కొట్టినట్లయింది.
హామీలపై కేంద్రం శీతకన్ను
రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో ఎక్కడ లేని అలసత్వం చూపుతున్న ఎన్డీయే సర్కార్ తాజాగా రైల్వే జోన్ నిరాకరణ ద్వారా తన నైజాన్ని చాటుకుంది. నిన్న హోంశాఖ నిర్వహించిన విభజన సమస్యల పరిష్కార సమావేశంలో రైల్వే జోన్ పై కేంద్రం చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం పూర్తిగా మొదటికొచ్చినట్లయింది. దీంతో కేంద్రం తీరుపై రాష్ట్రంలో మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విభజన హామీలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీలు ఇరుకునపడ్డాయి.
ఇద్దరికీ షాకే
విభజన హామీల్ని ఉల్లంఘిస్తున్నా బీజేపీకి బేషరతు మద్దతుగా నిలుస్తున్న జగన్, చంద్రబాబు తాజాగా రైల్వే జోన్ నిరాకరణతో మరోసారి ఇరుకునపడ్డారు. ఇప్పుడు దీనిపై పరస్పర విమర్శలు చేసుకోలేక, అలాగని కేంద్రాన్ని విమర్శించలేక వీరిద్దరూ తేలుకుట్టిన దొంగల్లా మిగిలిపోతున్నారు. విభజన హామీల్ని కేంద్రంతో అమలు చేయిస్తామన్న హామీ మరోసారి ఇవ్వాలంటేనే వీరు భయపడే పరిస్ధితులు తలెత్తుతున్నాయి. బీజేపీతో అంటకాగి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ తో పాటు బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబుకూ కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఇబ్బందికరమే.
టీడీపీకి ఇంకాస్త ఎక్కువ నష్టం
హామీలు అమలు చేయని కేంద్రం నుంచి బయటికి వచ్చి రాజకీయంగా నష్టపోయిన చంద్రబాబు మరోసారి అదే బీజేపీతో పొత్తు కోసం మూడేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తోడు లేకపోవడంతో నష్టపోయినట్లు గ్రహించి ఆ పార్టీతో పొత్తు కోసం అర్రులు చాస్తున్నారు. అయితే జగన్ మాత్రం బీజేపీకి కేవలం రాష్ట్ర అవసరాల కోణంలోనే మద్దతిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో ఈ విషయంలో జగన్ కాస్త సేఫ్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలాగని కేంద్రంతో విభజన హామీలు అమలు చేయించే బాధ్యత నుంచి జగన్ కూడా తప్పించుకోలేరు. కానీ భవిష్యత్తులో బీజేపీతో నేరుగా పొత్తు కోరుకుంటున్న చంద్రబాబుపై ఈ ప్రభావం ఎక్కువగా పడబోతోందని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.
రైల్వే జోన్ రద్దు లేదు: రైల్వే మంత్రి స్పష్టత
మిగిలిన హామీల సంగతి ఎలా ఉన్నా.. ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో మాత్రం ఏపీకి కాస్త ఊరట లభించింది. ఢిల్లీ వేదికగా కేంద్ర రైల్వే మంత్రి స్వయంగా ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చారు. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి వదంతులు నమ్మొద్దని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. జోన్ ఏర్పాటుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని కూడా వివరించారు.
రైల్వే జోన్ రాకుంటే రాజీనామా: వైసీపీ ఎంపీ
విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని విజయసాయి రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక రైల్వే జోన్ ను కేంద్రం రద్దు చేస్తుందంటూ ప్రచారంలో ఉన్న వార్తలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. అసలు విభజన అంశాలపైన చర్చ సమయంలో విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేదన్నారు. రాజధాని నుంచి కోవూరు మీదుగా తెలంగాణకు రైల్వే లైన్ గురించి మాత్రమే చర్చ జరిగిందన్నారు. విశాఖకు రైల్వే జోన్ కోసం తమ పార్టీ నేతలు పోరాటం చేశారని గుర్తు చేసారు.
వైసీపీ ట్రాప్‌లో టీడీపీ పడింది: బీజేపీ
ఢిల్లీలో జరిగిన హోంశాఖ భేటీలో ఏపీకి రైల్వే జోన్ నిరాకరించినట్లు వచ్చిన వార్తల్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఈ భేటీలో రైల్వే జోన్ పై అసలు చర్చే జరగలేదన్నారు. వైసీపీ వేసిన ట్రాప్ లో మరోసారి టీడీపీ పడిందని వ్యాఖ్యానించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో పత్రికల్లో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్ధారణ కాని వార్తలు రాస్తే మీ విశ్వసనీయత దెబ్బ తింటుందని హెచ్చరించారు. కేంద్ర క్యాబినెట్ లో నిర్ణయం జరిగాకే రైల్వే జోన్ ఆమోదించారని, ఎవరో ఏదో చెప్పారని అబద్దాలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. కేంద్రం గతంలోనే ఓకే చేసినట్లు కథనాలు మీరు చూడలేదా అని అడిగారు. కేంద్ర రైల్వే మంత్రి చెప్పిన సారాంశాన్ని జీవీఎల్ ప్రెస్ మీట్లో చదివి వినిపించారు.
మిగిలిన హామీల సంగతి?
రైల్వే జోన్ సంగతి పక్కన బెడితే.. ఏపీకి ఇచ్చిన హామీల విషయమై మొత్తం 14 అంశాలపై ఢిల్లీలో చర్చ జరిగింది. మరి ఆ మిగిలిన అంశాలపై ఏం తేల్చారనే దానిపై అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
ఇవి కూడా చదవండి: