Pawan Kalyan:రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

by D.Reddy |
Pawan Kalyan:రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై (AP Budget) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్పందించారు.ఈ బడ్జెట్ సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chadrababu) నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టిందని వెల్లడించారు. ఈ బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా, అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉందని తెలిపారు. ప్రాధాన్యతల వారీగా అన్ని శాఖలకు కేటాయింపులు పెరగడంతో పాటు, మూలధన వ్యయాన్ని రూ.40,636 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతులు రాష్ట్రంలో పెరుగుతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరపడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఇప్పటికే అందిస్తున్న పింఛన్ల పెంపుదల, దీపం 2 పథకాలకు నిధుల కేటాయింపుతోపాటు మిగిలిన సూపర్ సిక్స్ పథకాల హామీలను తప్పకుండా నెరవేరుస్తామని బడ్జెట్ కేటాయింపుల ద్వారా నిరూపించుకున్నామన్నారు. అలాగే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, శాఖలకు తగిన కేటాయింపులు, సంక్షేమ ఫలాలపై తగిన దూరదృష్టితో ముందుకు వెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామీణాభివృద్ధికి భారీ కేటాయింపులు ద్వారా పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకుంటాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. జల్‌జీవన్‌ మిషన్‌ పథకం పొడిగింపు ద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌కు రాష్ట్ర వాటా కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. వచ్చిన నిధులను ప్రణాళిక లేకుండా ఇష్టానుసారం వ్యయం చేశారని విమర్శించారు. ఇక వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు చెబుతున్నాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రైతాంగానికి మేలు చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ శాఖల అధికారులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

Next Story