SSBN కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ (వీడియో)

by Anukaran |   ( Updated:2023-04-13 17:41:47.0  )
SSBN కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ (వీడియో)
X

దిశ, ఏపీ బ్యూరో : అనంతపురం జిల్లాలో ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ప్రైవేటీకరణ నిలిపేయాలంటూ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చేశారు. ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలను ఎయిడెడ్‌ కాలేజీగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీ ఝులిపించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

లాఠీచార్జ్ అమానుషం.. నారా లోకేష్

అనంతపురం జిల్లాలోని ఎస్ఎస్‌బీఎన్ ఎయిడెడ్ కాలేజీ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై లాఠీ ఝులిపించడం దుర్మార్గమన్నారు. విద్యార్థులు నిరసన తెలపడం రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం నేరమా అని లోకేశ్ ప్రశ్నించారు. విద్యార్థి ఉద్యమాలను అణిచి వేయాలని చూసిన ఎంతటి నియంతైనా నేలకొరగడం ఖాయమని హెచ్చరించారు. విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్ అహంకార ధోరణికి నిదర్శనమని లోకేష్ ధ్వజమెత్తారు. పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని.. అలాగే విద్యార్థులపై విరుచుకుపడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed