హుజురాబాద్‌లో ‘చీకటి రాజ్యం’.. హైకోర్టు జోక్యం తప్పదా.?

by Anukaran |
Huzurabad
X

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో పోలీసు నిర్బంధం, చీకటి రాజ్యం నడుస్తోందని, ప్రోటోకాల్‌ను విస్మరిస్తూ ఇతర ప్రాంత ఎమ్మెల్యేలు పనులకు శంకుస్థాపన చేయడం ఏంటని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

హుజురాబాద్ ప్రజల మీద తోడేళ్ల లాగా విరిచుకుపడుతున్నారనీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై, చైతన్యవంతంగా మాట్లాడుతున్న వారిపై అకారణంగా కేసులు పెడుతున్నారనీ, మా నాయకుల ఫోన్లు టాప్ చేస్తున్నారనీ, ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీని తెలంగాణలో నిషేధించిన పార్టీలా చూస్తున్నారని ప్రభుత్వ, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు టీం సభ్యులు ఇంటింటికీ వెళ్ళి మరీ బెదిరింపులకు దిగుతున్నారనీ, అలాంటి చర్యలు మానుకోకపోతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

దళిత బంధు రావాలంటే టీఆర్ఎస్‌కు ఓటు వేసే వారికి మాత్రమే ఇస్తామని, గులాబీ కండువా కప్పుకుంటేనే ఇస్తామని, టీఆర్ఎస్ జెండా ఇంటిమీద కడితే మాత్రమే ఇస్తామని మూర్ఖంగా సీఎం వ్యవహరిస్తున్నారనీ విరుచుకుపడ్డాడు. ఇక్కడ తిరుగుతున్న పోలీసులు, అధికారుల పని తీరుమీద, నిర్బంధం మీద నివేదిక తయారు చేసి కేంద్ర హోమ్ మంత్రికి పంపించాం, హెచ్‌ఆర్‌సీ‌లో కంప్లయింట్ చేస్తాం, హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అధికారులు, చట్టపరంగా పని చేయకపోతే శిక్ష తప్పదని, తదుపరి పరిమాణాలకు మీరే బాధ్యులు అవుతారని పేర్కొన్నారు. దళితబంధుని స్వాగతిస్తున్నామని ఎప్పుడో చెప్పాము. కానీ, అందరికీ ఇవ్వాలని తాను కోరుతుంటే, కొందరు నాయకులు తన మాటలను వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని అలాంటి వారికి దళితులే బుద్ధి చెబుతారని వివరించారు. దళితబంధుకి విధివిధానాలు లేవు, డబ్బులు ఉన్నవారికి, ఉద్యోగాలు చేసే వారికి, తనకు నచ్చిన వారికి మాత్రమే దళిత బంధు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.

ఈ పరిణామాన్ని నిరసిస్తూ, దళిత వాడలు భగ్గుమన్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం వస్తున్నారని, బీజేపీ నాయకులను, కార్యకర్తలను, ప్రశ్నించే వారందరినీ అరెస్ట్ చేస్తున్నారు.? ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారని, పోలీసులు తీసుకెళ్లిన వారికి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఓపికను బలహీనతగా భావిస్తే మంచిది కాదని, బేషరతుగా అందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఒడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలే కథానాయకులు అవుతారని.. మీకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. హుజురాబాద్ ప్రజలు వెర్రి బాగులవారు కాదని, ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ, దానికి కారణం అయిన ఈటల రాజేందర్‌ను మరచిపోకండని కోరారు. విలేకర్ల సమావేశంలో మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు..

Advertisement

Next Story