ఎలక్షన్ ఎఫెక్ట్.. పోలీసుల పహారాలో హుజురాబాద్.. వారిపై స్పెషల్ ఫోకస్

by Anukaran |
Constables,-Huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బై పోల్ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇప్పటికే మూడు వేల మంది బలగాలు బందోబస్తు నిర్వహిస్తుండగా అదనంగా మరో 3 వేల మందిని రంగంలోకి దింపనున్నట్టు సమాచారం. ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలను కట్టడి చేసేందుకు కమిషనరేట్ పోలీసులు బలగాలను మోహరించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు అవసరమైనన్ని బలగాలను నియోజకవర్గానికి పంపించనున్నారు.

అకామిడేషన్ ఎలా.?

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇక్కడకు చేరనున్న బలగాలకు వసతి సౌకర్యం కల్పించే విషయంపై పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా ఇంతకాలం పాఠశాలలకు సెలవులు ఉన్నాయి. ఇప్పుడు పాఠశాలలు తెరుచుకోవడంతో పోలీసులకు ఎక్కడ వసతి ఏర్పాటు చేయాలోనన్న విషయంపై దృష్టి సారించారు. ఫంక్షన్ హాల్స్ కూడా ఆయా పార్టీలు లీజ్‌కు తీసుకోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే యోచనలో పోలీసు యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తోంది.

బైండోవర్లపై నజర్..

ఎన్నికల నేపథ్యంలో గొడవలకు పాల్పడే అవకాశం ఉన్న వారి జాబితాను సిద్ధం చేసిన పోలీసు యంత్రాంగం వారందరినీ మరోసారి సంబంధిత తహసీల్దార్ల ముందు బైండోవర్లు చేసేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు. వీరిపై ప్రత్యేక నిఘా వేసి గొడవలకు పాల్పడినట్టయితే ఎలక్షన్ వాయిలెన్స్ ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

సెన్సిటివ్ బూతులు..

నియోజవకర్గంలో 309 పోలింగ్ బూతులు ఉండగా వీటిలో సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్ బూతులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గత ఐదు నెలలుగా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించిన అధికారులు ఆ ప్రాంతాల్లోని బూతులపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed