ప్రత్యర్థిని దెబ్బతీయాలని యువకుడు పన్నాగం.. పోలీసుల ఎంట్రీతో..

by Sumithra |
Gold jewelry theft
X

దిశ, భువనగిరి రూరల్: ‘చెడపకురా చెడెదవు’ అనే సామెత ఇతడికి పక్కాగా సరిపోతుంది. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థిని ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్రపన్ని కటకటాలపాలయ్యాడో వ్యక్తి. ఇటీవల భువనగిరిలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులకు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

భువనగిరి పట్టణంలో మీనానగర్‌కు చెందిన తల్లాస్ సుల్తాన్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగలగొట్టి ఉన్నది. వెంటనే ఇంట్లో పరిశీలించగా.. 17 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు తల్లాస్ సుల్తాన్ బంధువు, స్థానికంగా గాలి పంపు షాపు నిర్వాహకుడైన అద్నాన్ షమీపై అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు.

పోలీసుల విచారణలో దొంగతనం తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. తల్లాస్ సుల్తాన్‌తో ఉన్న పాత కక్షలు ఉన్నాయని, అతడిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయాలనే చోరీ చేసినట్లు అద్నాన్ షమీ విచారణలో తెలిపాడని ఏసీపీ వెంకట్ రెడ్డి చెప్పారు. నిందితుడి నుంచి 17 తులాల బంగారం స్వాధీనం చేసుకుని, మంగళవారం కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీపీ తెలిపారు.

Advertisement

Next Story