‘కరోనా’పై ఖాకీల సైకిల్ గస్తీ

by Sridhar Babu |
‘కరోనా’పై ఖాకీల సైకిల్ గస్తీ
X
దిశ, కరీంనగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) విషయంలో సామాజిక దూరం పాటించాలని అధికార యంత్రాంగం చెబుతున్నా వినిపించుకోవడం లేదు కొంతమంది. పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఓ వైపున డ్రోన్ కెమెరాల నిఘా మరో వైపున అధికార యంత్రాంగం అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా మహమ్మారి కరోనా అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్న వారిని నియంత్రించాలని భావించి వినూత్న ఆలోచన చేశారు ఓ ఎస్సై. వాహనాలపై తిరుగుతుంటే ముందే పసిగట్టి పరార్ అవుతున్నారని గుర్తించి సైకిల్‌పై సవారీ చేస్తూ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆయనే పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ ఎస్సై శ్యాం పటేల్.
ఈ గస్తీతో ప్రజలపై కేసులు పెట్టేందుకు కాకుండా ముందుగా వారిని వ్యక్తిగతంగా కలుస్తున్నారు కమాన్‌పూర్ పోలీసులు.
కరోనా కట్టడి చేసేందుకు గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. డిపార్ట్ మెంట్ వాహనాలయితే ముందుగానే గుర్తు పడుతున్నారనీ, మోటారు సైకిళ్లపై వెళ్లినా వారు పోలీసుల బైకేనని అనుమానించి తప్పించుకుంటున్నారని ఎస్సై చెబుతున్నారు. అందుకే ఇలా వెళ్తున్నట్టు తెలిపారు. రాత్రి వేళల్లో తానో సైకిల్, తన అంగరక్షుకుడు ఓ సైకిల్ ఎక్కి వీధుల్లో తిరుగుతున్నారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతం కూడా కావడంతో కమాన్‌‌పూర్‌లో కార్మికులు సైకిళ్లపైనే వస్తుంటారని భావించిన స్థానికులు ఇంటి ముందే ముచ్చట్లు పెట్టుకుంటూ అలాగే ఉంటున్నారు. దాంతో వారిని సమీపించిన తర్వాత ఎస్సై, పోలీసులు అసలు కరోనా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుంది ? ఈ వ్యాధి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. చడీ చప్పుడు లేకుండా సైకిల్‌పై వెళ్తున్న పోలీసులు సమూహం వద్దకు చేరుకునే సరికి కూడా ప్రజలు గుర్తు పట్టడం లేదు. గుంపులుగా చేరిన వారికి కరోనా కట్టడికి తీసుకోవల్సిన జాగ్రత్తలను సమగ్రంగా వివరిస్తున్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, రాత్రి వేళ్లల్లో కర్ఫ్యూ విధించడానికి కారణం తదితర అంశాల గురించి చెబుతున్నారు.
గ్రామీణ వాతావరణం కావడంతో ప్రజలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కన్న ముందుగా వారిని చైతన్యపర్చాలన్న లక్ష్యంతో సైకిళ్లపై తిరుగుతున్నామని కమాన్ పూర్ ఎస్సై శ్యాం పటేల్ చెబుతున్నారు. టీవీలు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వం కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రతలపై సమగ్రంగా వివరిస్తున్నా కొన్ని ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా వారిని వ్యక్తిగతంగా కలిసి వివరించాలని నిర్ణయించుకుని సైకిల్‌పై గస్తీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత కూడా ప్రజల్లో మార్పు రానట్టయితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయంటున్నారు కమాన్ పూర్ పోలీసులు.
పోలీసుల వస్తారన్న బయంతో బలవంతంగా ఇళ్లకు పరిమితం కావడం కన్న కరోనా వస్తే ఎంతటి ప్రమాదమో వివరించడం వల్ల తమ ప్రాణాలకు ఎంత ప్రమాదమో తెలుసుకుని ప్రజలే స్వీయ కట్టడికి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కమాన్‌పూర్ పోలీసులు వినూత్నంగా చేపట్టిన సైకిళ్లపై గస్తీ సానుకూల ఫలితాలను ఇస్తోంది. ఈ విధానం వల్ల పోలీసులకు కూడా వ్యాయామం చేసినట్టు అవుతోందనీ, అలాగే వాహనాలపై తిరిగడం వల్ల కాలుష్యాన్ని నివారించడంతో పాటు ఖర్చు కూడా తగ్గించే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు పోలీసు అధికారులు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి గురించి రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీసులు చేపట్టిన సైకిల్ గస్తీ వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావాలని మనమూ ఆశిద్దాం.
Tags: Police, riding, on bicyles, Patrol, covid 19 effect, lock down
Advertisement

Next Story

Most Viewed