సైన్యంలో చేరిన ఆ దేశ ప్రథమ మహిళ!

by Anukaran |   ( Updated:2020-10-29 05:11:49.0  )
సైన్యంలో చేరిన ఆ దేశ ప్రథమ మహిళ!
X

దిశ, వెబ్‌‌డెస్క్: యుద్ధంలో రాజు ముందుండి నడిపిస్తే.. సైనికులకు కూడా వెన్నుచూపని ధైర్యం ఉంటుంది. అయినా.. ఇప్పుడెక్కడి రాజ్యాలు, యుద్ధాలు అంటారా? ప్రస్తుతం రాజ్యాలు, రాజులు లేరు కానీ.. ఇంకా కొన్ని దేశాల్లో మటుకు ప్రత్యక్ష యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా అజర్‌బైజాన్, అర్మేనియా దేశాలు నాగోర్నో- కరాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం పోరు సాగిస్తున్నాయి. ఈ పోరులో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే అక్కడ మళ్లీ యుద్ధం జరగగా 23 మందికి పైగా చనిపోయారు. ఈ క్రమంలోనే అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యన్ సైన్యంలో చేరాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రధాని మాటకు స్పందించిన ఆయన భార్య, అర్మేనియా మొదటి మహిళ ‘అన్నా హకోబ్యాన్’ కూడా సైన్యంలో చేరింది.

ఇప్పుడు అర్మేనియా, అజర్ బైజాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ పరిస్థితుల్లోనే అర్మేనియా ప్రధాని పషిన్యన్ ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపును స్వాగతించి, నాగోర్నో- కరాబాఖ్ ప్రాంతం కోసం పోరాడేందుకు 13 మంది మహిళలతో కూడిన టీమ్‌లో సభ్యురాలిగా ప్రధాని భార్య హకోబ్యాన్ మిలటరీలో చేరడం విశేషం. దేశ మొదటి మహిళే ఆర్మీలో జాయిన్ అయ్యిందంటే.. ప్రజలు కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకుని, ఆర్మీలో చేరేందుకు ముందుకు వస్తారనడంలో సందేహం లేదు. అందుకే దేశ రక్షణ కోసం ఆమె ముందడుగు వేసింది.

‘నేను అర్మేనియా ఆర్మీలోని 13 మంది మహిళా స్క్వాడ్‌లో జాయిన్ అవుతున్నాను. త్వరలోనే కంబాట్ ట్రైనింగ్‌లో పాల్గొంటాను. దేశ ఆత్మగౌరవాన్ని, దేశ భూభాగాన్ని శత్రువులకు వదిలిపెట్టే సమస్యే లేదు. అర్మేనియా ప్రజలారా..! మన మాతృభూమి కోసం మిలటరీలో జాయిన్ అయ్యే టైమ్ వచ్చింది. అర్మేనియా ప్రజలు తమ దేశ రక్షణ కోసం ఏం చేస్తారో ఈ ప్రపంచానికి చూపించాలి. చిన్న, పెద్ద, మహిళలు అందరూ ఏకం కావాలి’ అని హకోబ్యాన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

అర్మేనియన్ టైమ్స్‌కు ఎడిటర్‌గా కొనసాగుతున్న హకోబ్యాన్‌కు ఆర్మీ ట్రైనింగ్ కొత్తేం కాదు. గతంలోనూ కరాబాఖ్‌కు చెందిన మహిళా గ్రూపుతో కలిసి ఏడు రోజుల కంబాట్ ట్రైనింగ్‌లో ఆమె పాల్గొంది. కంబాట్ వెపన్స్ ఎలా యూజ్ చేయాలో కూడా ఆమెకు తెలుసు. హకోబ్యాన్ గొప్ప సమాజ సేవకురాలు కూడా. ఆమె ‘మై స్టెప్ చారిటబుల్ ఫౌండేషన్’ కూడా ప్రారంభించి సేవలందిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed