MS ధోనీకి ప్రధాని మోడీ లేఖ..

by Shamantha N |
MS ధోనీకి ప్రధాని మోడీ లేఖ..
X

దిశ, వెబ్‌డెస్క్: మిస్టర్ కూల్, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆగస్టు 15న ట్విట్టర్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు. ఈ నేపథ్యంలో టీం ఇండియాకు ధోని అందించిన సేవలను అభినందిస్తూ.. ప్రధాని మోడీ సుదీర్ఘ లేఖ రాశారు. ఆ విషయాన్ని ధోని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపాడు.

లేఖలోని సారాంశం ప్రకారం.. ‘ఎవరూ ఊహించని విధంగా మీ స్టైల్లోనే ఆగస్టు 15న ఒక చిన్న వీడియోతో రిటైర్మెంట్‌ ప్రకటించి దీర్ఘకాలంగా నడుస్తున్న ఒక చర్చకు తెరదించారు. ఈ నిర్ణయం 130 కోట్ల మందిని బాధించినా.. 15 ఏళ్లుగా భారత క్రికెట్‌కు మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

అంతేకాకుండా, టీమ్‌ఇండియాకు మీరు అతి గొప్ప సారథి. మీ కెప్టెన్సీతో జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అలాగే ఒక బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. కష్ట సమయాల్లో మీరున్నారనే భరోసా, మ్యాచ్‌ను గెలిపిస్తారనే ధీమా ఈ భారతావని ఎప్పటికీ మర్చిపోదు. మరీ ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌ సాధించిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో నిలిచిపోతుంది.

‘మన ప్రయాణం ఎటుపోతుందనే విషయం తెలిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అవసరం లేదు. మీరు ఎంతో మంది యువతలో స్పూర్తిని రగిలించారు. అందుకు.. మీరు సాధించిన 2007 టీ20 ప్రపంచకప్పే అసలైన ఉదాహరణ. కష్ట సమయాల్లో మీరు జట్టు నడిపించిన తీరే వారికి ప్రేరణ. ఇక మీరు భద్రతా దళాల్లో చేసిన సేవలు అమోఘం. మన సైనికులతో కలిసి పనిచేయడానికి ఎంతో సంతోషంగా ముందుకొచ్చారు. వాళ్ల మంచికోసం మీరు పడే తపన ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని మోడీ మెచ్చుకున్నారు.

చివరగా సాక్షి, జీవాపై స్పందించిన మోదీ.. ఇప్పుడు వారు ధోనీతో అధిక సమయం గడుపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఓ మ్యాచ్‌లో విజయం సాధించాక ధోని తన కూతురు జీవాతో ఆడుకోవడం చూశానని, అది ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed