‘‘కరోనా కట్టడికి వివిధ రంగాల పాత్ర ప్రశంసనీయం’’

by Shamantha N |
‘‘కరోనా కట్టడికి వివిధ రంగాల పాత్ర ప్రశంసనీయం’’
X

ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తున్న ఈ తరుణంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో విశేష కృషి చేస్తున్న వివిధ రంగాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. బాధితులకు, అనుమానితులకు విశేష సేవలందిస్తున్న డాక్టర్లను, వైద్య సిబ్బందిని అభినందించారు. అలాగే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్న”మీడియా పాత్రను” ప్రధాని కొనియాడారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలంతా షేక్‌హ్యాండ్ బదులు ‘‘నమస్తే..’’ అంటూ పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ,ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి వ్యాధి విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కోరారు. ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందకుండా, ప్రజలకు కచ్చితమైన, ఉపయోగకరమైన సమాచారాన్ని మీడియా చేరవేస్తోందని కితాబిచ్చారు. అవసరమైన చోట వైద్య వసతుల్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ విషయంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించాల్సిన అసవరం ఉందనీ, అందుకనుగుణంగా కార్యక్రమాల్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

కరో‘న’ హ్యాండ్ షేక్- కరో నమస్తే..

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కరోనా వైరస్‌పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ‘కరో న హ్యాండ్‌షేక్- కరో నమస్తే’ అని రాసిఉన్న క్యాప్ ధరించి వచ్చిన బీజేపీ ఎంపీ రాజ్‌‌కుమార్ చహార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ఎంపీలను సమావేశంలోకి అనుమతించడం గమనార్హం. ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా త్వరగా ముగించాలంటూ పలువురు ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఆవరణంలో ప్రవేశించే అధికారులు, సెక్యురిటీ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కూడా థర్మల్ స్క్రీనింగ్ జరిపాకే లోనికి రానిస్తున్నారు

Tags : corona (covid-19), bjp parliamentary party meeting, pm modi

Advertisement

Next Story

Most Viewed