తలకు హెల్మెట్ ధరించి.. ఉస్మానియా పీజీల వినూత్న నిరసన

by Shyam |   ( Updated:2021-10-26 03:57:27.0  )
Osmania PG Doctors
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందికి రక్షణ కరువైందని మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పీజీ వైద్య విద్యార్థులు తలకు హెల్మెట్ ధరించి విధులకు హాజరయ్యారు. డెర్మటాలజీ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ భువనశ్రీ ఓపీ విధులు నిర్వహిస్తున్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ ఊడి తలపై పడి గాయాల పాలైన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ.. పీజీలు తలకు హెల్మెట్ ధరించి డ్యూటీలు చేశారు. కొద్ది సేపటి తర్వాత విధులు బహిష్కరించి ఓపీ భవనం ముందు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉస్మానియా ఆసుపత్రిలో నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్నట్లు తెలిపారు. పాత భవనంలో తరచుగా సీలింగ్ పెచ్చులూడి పడడం వంటి ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు గతంలో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా.. ఇతర భవనాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండడం తమను ఆందోళనలకు గురి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావ‌ృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed