- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అల్లరి కోతిపిల్ల
దిశ, కథాస్రవంతి : రచన, శ్రీధర్ ల ఒక్కగానొక్క ముద్దుల కూతురు పింకీ. తండ్రి గారాభంతో చాలా మొండిగా తయారైంది. ఎనిమిదేళ్ల పింకీకి అన్నం తినిపించాలన్నా, హోంవర్క్ చేయించాలన్నా, నిద్రపుచ్చాలన్నా రచన తల ప్రాణం తోకకి వచ్చేది. స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుండి ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ ఉండేది. వద్దంటే ఏడుపు మొదలు పెట్టేది, అన్నం తినకుండా అలిగేది. “అబ్బా పిల్లని ఎడిపించకు రచన… ఇచ్చేయి” అనేవాడు ఆమె భర్త. చేసేదేమిలేక ఫోన్ ఇచ్చేసేది. చెప్పిన మాట వినేది కాదు. గట్టిగా అరిచి చెప్తే చేతిలో వస్తువులను విసిరేసి అక్కడనుంచి వెళ్లిపోయేది.
తల్లి, తండ్రి, ఆఖరికి స్కూల్లో టీచర్‌కి కూడా భయపడేది కాదు. పింకీ గురించి తెలుసుకున్న ఆమె స్నేహితులు పింకీని పెంకీ అని పిలిచి ఆటపట్టించేవారు. తమతో కలుపుకునేవారు కాదు.
ఈ వయసులోనే ఇలా ఉందంటే పెద్దయ్యాక పింకీ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచన వచ్చినప్పుడల్లా రచన వణికిపోయేది. పింకీని మార్చడం ఎలా అని ఆలోచిస్తూ ఉండేది.
ఆరోజు కూతురు పుట్టినరోజు అవడంతో పింకీని తీసుకొని గుడికెళ్లింది రచన. దైవ దర్శనానంతరం బైటికొచ్చిన వారికి తమ స్కూటీపై కూర్చొని కొబ్బరి చెక్కని తింటున్న కోతిపిల్ల కనిపించింది. అది మరీ చిన్నది అవడంతో చేతిలోని కొబ్బరి చెక్కని తినడానికి చాలా తంటాలు పడుతుంది. పింకీకి అది చాలా ముద్దుగా అనిపించింది. తన బ్యాగ్‌లో ఉన్న చాక్లెట్‌ని తీసి కోతి పిల్ల దగ్గరకు విసిరింది. అది వెంటనే తన చేతిలో ఉన్న కొబ్బరి చెక్కని పింకీ దగ్గరికి విసిరింది. పింకీకి కోతిపిల్ల బాగా నచ్చేసింది. దానికి దగ్గరగా వెళ్లి ఆడుకోసాగింది.
పింకీకి స్కూల్ టైం అవ్వడంతో రచన తన స్కూటీ మీదున్న కోతిపిల్లని కొంచెం భయపెట్టి అక్కడనుంచి పంపించడానికి దాని మీదకు చెయ్యెత్తింది వెంటనే అది కూడా రచన మీదకి చెయ్యేతింది. రచన చేత్తో కళ్ళు రుద్దుకుంటే అది కూడా అలాగే చేసింది. ఎదుటి మనిషి ఎంచేస్తే ఆ కోతిపిల్ల అది చేస్తుందనే విషయం అర్థమయిన రచనకు ఒక మంచి ఆలోచన తట్టింది.
“పింకీ స్కూల్ టైం అవుతోంది వెళదామా?” అడిగింది పింకీని. “మమ్మీ ఇంకో 5 మినిట్స్ ఆడుకుంటాను” చెప్పింది పింకీ. సరే ఆడుకో కానీ తర్వాత ఇంటికి తీసుకెళదామంటే మాత్రం నేను ఒప్పుకోను అంది పింకీ మనస్తత్వం తెలిసిన రచన. అప్పటిదాకా ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచన రాని పింకీ “మమ్మీ ప్లీజ్ ఇంటికి తీసుకెళదాం. నాకు ఇది కావాలి అని మారం చేయడం మొదలు పెట్టింది. రచన కుదరదు అనేకొద్దీ ఇంకా ఎక్కువ పేచీ పెట్టింది.
“సరే తీసుకెళదాం… కానీ దాని పని అంతా నువ్వే చూసుకోవాలి. మా పింకీ పనులతోనే అల్లాడిపోతున్నాను. ఇంక ఈ మంకీ పనులు కూడా చేయాలంటే నా వల్ల కాదు. ఆలోచించుకో… దాని పూర్తి పని నీదే. అలా అయితేనే తీసుకెళదాం” తేల్చేసింది రచన.
తల్లి మాటలకి ఆలోచనలో పడింది పింకీ. చాక్లెట్ తింటూ అమాయకంగా తనవైపు చూస్తున్న కోతిపిల్లని అస్సలు వదిలి వెళ్లాలనిపించట్లేదు తనకి.
“ఓకే మమ్మీ. దాని పనులన్నీ నేనే చేస్తాను.” అని చెప్పి తల్లిని ఒప్పించింది. ఇద్దరూ కలిసి కోతిపిల్లని ఇంటికి తీసుకెళ్లారు. పింకీ ఇష్టపడడంతో తండ్రి కూడా అడ్డుచెప్పలేకపోయాడు.
‘యాపిల్ ‘ అని పేరు పెట్టింది పింకీ కోతిపిల్లకి. యాపిల్‌కి పింకీనే స్నానం చేయించేది, డైపర్ వేసేది, దాని కోసం కుట్టించిన చిన్న చిన్న గౌన్లు తొడిగేది. గౌనులో యాపిల్ చాలా ముద్దుగా అనిపించేది పింకీకి.
మొదట్లో రచన పింకీకి తినిపించేది. పింకీ యాపిల్‌కి తినిపించేది. ఎప్పుడైనా పింకీ తనంతట తాను తినడం చూసి యాపిల్ కూడా దానంతట అదే తినేది. ఇదేదో బాగుందని పింకీ తనంతట తానే తినడం అలవాటు చేసుకుంది. యాపిల్ కూడా అలాగే తినేది.
పింకీ స్కూల్ నుండి రాగానే యాపిల్ పరిగెత్తుకుంటూ వెళ్లి పింకీని చుట్టేసేది. కాసేపు యాపిల్‌తో ఆడుకున్న తర్వాత స్నానం చేసివచ్చి యాపిల్‌తో కలిసి అల్పాహారాన్ని ముగించుకొని హోంవర్క్ చేసుకునేది. తను హోంవర్క్ చేసుకుంటున్నంతసేపూ యాపిల్ కూడా పింకీ పక్కనే కూర్చుని పుస్తకాలలో పేజీలు తిప్పుతూనో, బొమ్మలతో ఆడుతూనో ఉండేది. పింకీ హోంవర్క్ చేయకుండా ఆడుతూ ఉంటే యాపిల్ కూడా అల్లరి చేస్తూ ఉండేది. రచన “నీ గోలే తట్టుకోలేకపోతుంటే ఈ కోతిపిల్ల గోల ఒకటి. దానితో అల్లరి చేయించావంటే దాన్ని ఇంట్లో నుండి బయటికి పంపిచేస్తా” అనడంతో నిజంగానే పంపించేస్తుందేమో అని భయపడిన పింకీ తను అల్లరి చేయకుండా హోంవర్క్ చేసుకుంటూ కూర్చుంటే యాపిల్ కూడా అల్లరి చేయకుండా కూర్చునేది. హోంవర్క్ అయిపోయాక యాపిల్‌తో కలిసి భోజనం చేసి పడుకునేది పింకీ.
ఎప్పుడైనా పింకీ చెప్పిన మాట వినకుండా అలిగి చేతిలో వస్తువులు విసిరేస్తే యాపిల్ కూడా వస్తువులను విసిరేసి చిందరవందర చేసేది ఇల్లంతా. తర్వాత అదంతా పింకీ నే సర్దాల్సి వచ్చేది. ఎందుకొచ్చిన గొడవలే అని కోపంలో వస్తువులను విసిరేసే అలవాటును మానుకుంది పింకీ.
ఇప్పుడు పింకీ అంతకుముందులాగా రోజంతా ఫోన్లో గేమ్స్ ఆడుతూ గడపడం లేదు. తనకి యాపిల్ తో ఆడుతుంటే ఉన్నంత ఆనందం ఫోన్ గేమ్స్‌తో ఉండట్లేదు.
పింకీలో క్రమంగా వస్తున్న ఈ మార్పుని చూసి మనసు స్థిమితపడింది రచనకి.
యాపిల్‌తో ఆడుకోడానికి ఇంటికి వస్తూవుండేవారు పింకీ స్నేహితులు. తనలో వచ్చిన మార్పు వలన అంతకుముందులాగా ‘పెంకీ’ అని ఏడిపించకుండా పింకీని తమతో కలుపుకొని ఆడుకునేవారు.
ఇదంతా చూసిన రచన, శ్రీధర్‌లు చాలా సంతోషపడ్డారు.