- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల మనిషి నర్రా
బహుముఖ సేవలు అందించిన కమ్యూనిస్టు యోధుడు
దిశ, నల్లగొండ: కమ్యూనిస్టు యోధుడు. 6 సార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి. ప్రజా ఉద్యమాలే జీవితంగా బతికిన ప్రజల మనిషి. కమ్యూనిస్టు ప్రమాణాలను ప్రాణంగా భావించిన ఆదర్శమూర్తి నర్రా రాఘవరెడ్డి. కష్ట జీవుల రాజ్య స్థాపనకు అహర్నిశలు పోరాడిన కమ్యూనిస్టుగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రాఘవరెడ్డి ప్రజలకు దూరమై నేటికీ సరిగ్గా ఐదేళ్లు కావస్తున్నది. నర్రా రాఘవరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం.
బాల్యవిశేషాలు
నర్రా రాఘవరెడ్డి 1924 సంవత్సరంలో చిట్యాలమండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన నర్రా కమలమ్మ-రాంరెడ్డిలకు జన్మించారు. చిన్న వయసులోనే తల్లి కమలమ్మ మరణించడంతో రాఘవరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. తండ్రి పెంపకానికి దూరమైన నర్రాను తన పెదనాయన నర్రా వెంకటరామిరెడ్డి పెంచుకున్నారు. పెంపకం తండ్రి చనిపోయాక మళ్లీ కన్న తండ్రి రాంరెడ్డి దగ్గరే ఉండాల్సి వచ్చింది. ఈసడింపుల మధ్య నలిగిపోయిన నర్రా బతుకు దెరువునెతుక్కుంటూ ఊరొదిలి బొంబాయికి వలస వెళ్లారు.
బొంబాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. చిట్టచివరికి ఊరోళ్ల సాయంతో బట్టల మిల్లులో కార్మికుడుగా చేరారు. కార్మికులకు కనీస హక్కులేని కాలమది. కంపెనీ యాజమాన్యం కార్మికుల కష్టాలు ఆలకించని పరిస్థితులుండేవి. కార్మికుల బాధలు తీర్చడానికి కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ‘లాల్‌బావుటా’ బలమైన కార్మిక సంఘంగా పనిచేసేది. అందులో సభ్యుడుగా చేరిన నర్రా చురుకైన పాత్ర పోషించారు.
తన ఊరి నుంచి ఉత్తరం రావడంతో 8 ఏళ్ల తర్వాత నర్రా తిరిగి సొంత ఊరొచ్చాడు. అప్పటికే దొరలు, పెత్తందార్ల ఆగడాలు సాగుతున్నాయి. సర్కార్‌ను వ్యతిరేకించే వారిపై కఠినమైన ఆంక్షలుండేవి. ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న భీసం ఎలమంద, కృష్ణమూర్తిల మీద నిషేధాజ్ఞలున్నాయి. బొంబాయిలో లాల్‌బావుటాలో పనిచేస్తున్న రోజుల్లోనే కమ్యూనిస్టు సిద్ధాంత పరిజ్ఞానాన్ని జీర్ణించుకున్న నర్రా జిల్లాకు వచ్చాక కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. 1949లో వట్టిమర్తి గ్రామంలో యువజన సంఘం స్థాపించి అధ్యక్షులుగా పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ కొరియర్‌గా పనిచేశారు. 1950లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం పొంది గ్రామ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత తాలూకా కమిటీ సభ్యునిగా ఎన్నికై ప్రజల, కార్యకర్తలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. జిల్లాకు వచ్చాక గ్రామాల్లో క్షేత్ర స్థాయి కార్యకర్తగా పనిచేశారు.
క్రమశిక్షణ, పట్టుదల, కార్యదక్షత కలిగిన నర్రా సిపిఎంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సర్పంచ్ మొదలుకుని శాసన సభ సభ్యుని వరకు అనేక పర్యాయాలు గెలుపొంది ప్రజల వాణిని చట్ట సభల్లో వినిపించారు. ప్రజా ఉద్యమ నిర్మాతగా, ప్రజా ప్రతినిధిగా పాలక వర్గాలకు జంకు పుట్టించారు. శాసనాల రూపకల్పన, వాటి అమలులో జరుగుతోన్న తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేసిన సందర్భాలనేకం ఉన్నాయి.
ప్రజాసమస్యలపై పోరాటాలు,
రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల, పథకాల రూపకల్పనలో ప్రభుత్వానికి నర్రా పలు సలహాలు, సూచనలు చేసి ప్రజా సంక్షేమానికి పాటుబడ్డారు. బాల్యంలోనే దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్ని ఏకం చేసిన నర్రా చివరి మజిలీలో సైతం ప్రజల పక్షమే వహించారు. రాజీలేని ప్రజా పోరాటాల ద్వారానే దోపిడీ శక్తుల్ని వెనక్కి కొట్టి ప్రజా రాజ్యాన్ని స్థాపించగలమనే విశ్వాసంతో కాలం గడిపారు. కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులుపై చేయి సాధించిన ప్రస్తుత తరుణంలో మరింత ధృడ సంకల్పంతో కమ్యూనిస్టులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
బహుముఖ సేవలు..
నర్రా రాఘవరెడ్డి తన ప్రజా జీవితంలో ప్రజలకు బహుముఖ సేవల్ని అందించారు. 1950 నుంచి సిపిఐ పార్టీ సభ్యునిగా కార్యకర్తగా కళాకారుడుగా అందరికీ పరిచయస్తులు. అంతరంగిక సమస్యలతో పాటు సైద్ధాంతిక విభేదాలతో కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత సిపిఎం విధానాలను ముందుకు తీసుకుపోవాలని నర్రా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కళాకారుడుగా పార్టీ నిర్మాణ బాధ్యుడుగా ప్రజా సమస్యల్ని అధికారుల వద్ద రిప్రజెంటేషన్ చేసేవారు. మళ్లీ 1968లో మొదలైన ఉగ్రవాద చీలికను సైతం ఎదుర్కోవడంలో నర్రా ఎంతో కృషి చేశారు. ఉగ్రవాదం వైపు వెళ్లిన కార్యకర్తల్ని మళ్లీ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రభావంతోనే 1972లో పార్టీ ఓటమి పాలైనా నిరాశకు గురికాలేదు. 1973లో బీబీనగర్-నడికుడి రైలు మార్గం విస్తరణకు కృషి చేశారు. ఎమర్జెన్సీ తర్వాత ఎమ్మెల్యేగా 1977లో గెలుపొందిన నర్రా శాసన సభలో ప్రజల, పార్టీ వాణిని వినిపించారు. పార్టీ నిర్మాణంలో కృషి చేస్తునే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సాధన కోసం అనేక పోరాటాలు చేశారు.
ప్రజా ప్రతినిధిగా పార్టీ నాయకునిగా పనిచేయడంతో పాటు ప్రజా సంఘాల నిర్మాణానికి పాటు పడ్డారు. గీత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా నర్రా ఎన్నికై ఎక్సైజ్ విధానానికి, కాంట్రాక్టు పద్ధతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి గుర్తింపు తెచ్చారు. గ్రామ సేవకుల సంఘాన్ని జిల్లాలో ఏర్పాటు చేసి రాష్ట్ర ఉద్యమంగా తీర్చిదిద్దడంలో నర్రా పాత్ర ఎంతో ఉంది. చేనేత కార్మికుల సమస్యలపై కూడా అనేక పోరాటాలు సాగాయి. వాటికి నర్రా నాయకత్వం వహించి సంఘాన్ని గుర్తింపులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. పార్టీ జిల్లా, నకిరేకల్ కార్యాలయాల నిర్మాణానికి కృషి చేశారు. గొల్లసుద్దుల-పిట్టల దొర ఇలా అనేక కళారూపాలు ప్రదర్శించి ప్రజల ఆదరణ పొందారు. సులభతరమైన సామెతలు- పొడుపు కథలు చెప్పి ప్రజల్ని అలరింపజేసేవారు.
ప్రజా ప్రతినిధిగా..
1959-67 వరకు వట్టిమర్తి (శివనేనిగూడెం-వట్టిమర్తి) గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అదే కాలంలో నార్కట్‌పల్లి నాన్‌బ్లాక్‌కి జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు. నర్రా రాఘవరెడ్డి తన రాజకీయ పోరాటంలో 1972లో మినహా ఎప్పుడూ ఓటమి చవిచూడలేదు. 1967, 1978, 1983, 1984, 1989, 1994లలో నకిరేకల్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 1999లో శాసన సభకు పోటీ చేయలేదు. సిపిఎం శాసన సభా పక్ష నేతగా, ఉప నేతగా పలు పర్యాయాలు పనిచేశారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుపై అనేక విమర్శనాస్త్రాలు సంధించారు.
నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 9, 2015 న మృతి చెందారు. భౌతికంగా ప్రజలకు దూరమై సరిగ్గా నేటికి ఐదేళ్లు కావస్తున్నా కమ్యూనిస్టు పోరాట యోధుడిగా, ప్రజానాయకుడిగా నర్రా రాఘవ రెడ్డి జీవితం అందరికీ ఆదర్శప్రాయం.
Tags: People’s Leader, Narra Raghava Reddy, communist movement, ideal person