ఫీవర్ సర్వే.. ఇంట్లో లేకుంటే ఆరోగ్యంగా ఉన్నట్టే.!

by Shyam |
ఫీవర్ సర్వే.. ఇంట్లో లేకుంటే ఆరోగ్యంగా ఉన్నట్టే.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఫీవర్​సర్వే సిబ్బంది మీ వద్దకు వచ్చినపుడు మీరు ఇంట్లో లేరా.. ఏదైనా పని మీదనో, ఉద్యోగం కోసమో బయటకు వెళ్లారా.. అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే… ఆస్పత్రులు, టెస్ట్ సెంటర్లలో పరిస్థితులు చూసి ఆందోళన చెంది మీకు కొవిడ్​ సంబంధ లక్షణాలు లేవని సిబ్బందికి చెబుతున్నారా.. అయితే అదే ఫైనల్​.. ఇలా సాగుతోంది రాష్ట్రంలో ఫీవర్​సర్వే.. ఎవరికి ఉపయోగమో, ఎలాంటి పరికరాలు లేకుండానే సాధారణ అనారోగ్యాలను పరిశీలించేందుకు ఇంత వ్యవస్థను నిరూపయోగ పరుస్తున్న ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కొవిడ్ ​కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఫీవర్​సర్వే నిర్వహించాలని ప్రభుత్వం వారం రోజుల క్రితం నిర్ణయించింది. ముందుగా జీహెచ్ఎంసీ, ఆ తర్వాత జిల్లాల్లోనూ ఈ సర్వే ప్రారంభమైంది. ఆశా వర్కర్, ఏఎన్ఎంలో కూడిన బృందం ఇంటింటికీ తిరుగుతోంది. నగరాల్లో వరుసగా ఇండ్లు, అపార్ట్‌మెంట్లలో సర్వే చేస్తుండగా.. గ్రామాల్లో ఇంటి నెంబర్ల ఆధారంగా సర్వే చేస్తున్నారు. అయితే సర్వే సమయంలో ఇంట్లో లేని వారు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే రాస్తున్నారు. ఇంట్లో ఉన్నవారిని పరీక్షించేందుకు సిబ్బంది వద్ద వైద్య పరికరాలు కూడా లేవు. కనీసం జ్వరం చెక్ చేసేందుకు థర్మామీటర్లు కూడా లేకుండానే ‘ఫీవర్​సర్వే’ సాగుతుండటం గమనార్హం.

సర్వేలో భాగంగా కుటుంబాల వద్దకు వెళ్లినపుడు వాళ్లు ఏదీ చెబితే అదే రాసుకుని వస్తున్నారు. జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పి వంటివి ఉన్నా కూడా లేవని చెప్పారంటే అదే రికార్డుల్లో రాసుకుని వస్తున్నారు. జ్వర, కొవిడ్​లక్షణాలు ఉన్నాయంటే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొవాల్సి వస్తుందోననే భయంతోనూ అబద్ధాలు చెబుతున్నట్టు క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తిస్తున్నారు. అనవసరంగా వారితో వాదనలు ఎందుకని కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారమే రికార్డుల్లో రాసుకుని తిరిగి వస్తున్నారు. ఇక ఎవరైనా తమకు జ్వరం లేదా ఇతర లక్షణాలు ఉన్నాయని చెబితే అందుకు సంబంధించిన టాబ్లెట్స్‌ను వారం రోజులకు సరిపడా ఇచ్చి వస్తున్నారు.

ఆ తర్వాత కూడా తగ్గకపోతే అవి కొవిడ్ ​లక్షణాలుగా అనుమానిస్తూ కరోనా పరీక్షల కోసం పంపుతున్నారు. కొవిడ్​సాధారణ ఐసోలేషన్​ సమయం 14 రోజులుగా ఉన్న పరిస్థితుల్లో.. సర్వేలో పాల్గొన్నవారికి కొవిడ్​ఉన్నా ఐదు రోజుల తర్వాతే పరీక్షలకు వెళ్లే విధంగా సర్వే రూపొందించారు. ప్రాథమిక వైద్య పరీక్షలకు అవసరమైన పరికరాలు కూడా లేకుండా కేవలం ఫీవర్​ సర్వే చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవని ప్రజలు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా ఇంటింటికి కొవిడ్​పరీక్షలు చేయడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు తగ్గి, వైద్య సహాయాన్ని అందించేందుకు వీలవుతుంది. కానీ ప్రభుత్వం ఫీవర్​సర్వేను నామమాత్రంగా నిర్వహిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది.

సర్వే బృందాలకు కొరవడిన రక్షణ..

ఇంటింటి ఫీవర్​సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మెడికల్, స్థానిక సంస్థల సిబ్బంది హుఠాహుటినా కుటుంబాలను సర్వే పనుల్లోకి దిగిపోయారు. వారికి అవసరమైన వైద్య పరికరాలతో పాటు కొవిడ్​రక్షణ కూడా లేకుండానే పర్యటిస్తున్నారు. సాధారణ జ్వరంతో పాటు కొవిడ్​ఉన్న వ్యక్తులను కూడా సర్వే సిబ్బంది కలవాల్సి ఉంటుంది. కరోనా వైరస్ ఎక్కడ ఉందో తెలియని స్థితిలో తమకు అప్పగించిన ఏరియాల్లో పని పూర్తిచేసే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతన్న క్రమంలో అక్కడ మనుషులను, వస్తువులను తాకాల్సి ఉంటుంది. వీరిలో ఎవరికి కరోనా ఉన్నా మరొకరికి వస్తుంది.

మెడికల్ సిబ్బందికే కరోనా వైరస్ ​అంటుకుంటే వారు మరికొంత మందికి సెకండ్​కాంటాక్ట్‌గా మార్చనున్నారు. ఇలాంటి ప్రమాదకర స్థితిలో వారికి చేతి గ్లౌజులు, శానిటైజర్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎలాంటి రక్షణ లేకుండా కొత్త వారిని కలుస్తున్న క్రమంలో తమకు కొవిడ్​ఎక్కడ అంటుకుంటుందోనని మెడికల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సాధారణ జ్వర లక్షణాలకు అవసరమైన మెడిసిన్స్​ఇచ్చేందుకు ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం లేదని, స్థానికంగా ఉండే హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ విభాగాల ద్వారా అవసరమైన వారు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తే కొవిడ్​ రిస్క్‌ను కూడా తగ్గించొచ్చని మెడికల్​సిబ్బంది సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed