టెస్టులు చేయించుకోకపోవడం వెనక పెద్ద సైకాలజీ

by sudharani |
టెస్టులు చేయించుకోకపోవడం వెనక పెద్ద సైకాలజీ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ టెస్టుల సంఖ్య పెరిగితే పాజిటివ్‌ల సంఖ్య కూడా పెరుగుతుందనేది విమర్శకుల వాదన. అంతేకాకుండా ఇప్పుడు కరోనా వైరస్ పట్టణాల నుంచి పల్లెలకు పాకింది. పట్టణాల్లో టెస్టులు చేయించుకోవడానికి చూపించిన ఆసక్తి పల్లెటూళ్లలో చూపించరు. కేవలం పల్లెటూళ్లలోనే కాదు, పట్టణాల్లో కూడా టెస్టులు చేయించుకుంటున్నారు కానీ వారికి పాజిటివ్ వచ్చిందా నెగెటివ్ వచ్చిందా? అనే విషయాన్ని చాలా మంది చెప్పట్లేదు. అంతెందుకు.. సెలెబ్రిటీలు కూడా పాజిటివ్ వచ్చిన వెంటనే పబ్లిక్‌తో చెప్పట్లేదు. 21 రోజుల క్వారంటైన్ పూర్తయ్యాక, ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక ప్రకటిస్తున్నారు. ఇలా ఎందుకు? ఉచితంగా టెస్టులు చేస్తామని ఇంటి వరకూ వెళ్లిన ఆశా వర్కర్లకు తిట్లతో స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఎందుకు? దీనికి సైకాలజిస్టుల దగ్గర కొన్ని వివరణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత కారణాలు వేరేగా ఉంటాయి. కానీ కొన్ని కారణాలు మాత్రం అందరికీ కామన్‌గా ఉంటాయని ప్రముఖ సైకాలజిస్ట్ బెక్కీ స్టంప్‌ఫిగ్ అంటున్నారు.

మానసిక భావోద్వేగ నిర్ధారణ..

నువ్వు పాజిటివ్ అని డాక్టర్ చెప్పగానే సంబంధిత పేషెంట్‌లో ఒకేసారి అనేక రకాల భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. షాక్, అపనమ్మకం, కోపం, చంచలం, బాధ, సిగ్గు, భయం, భవిష్యత్తు గురించి బెంగ, కుటుంబం గురించి ఆందోళన.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఒక్కసారిగా ముంచుకొస్తాయి. ఇక ఎలాంటి లక్షణాలు కనిపించకుండా పాజిటివ్ వచ్చినా పరిస్థితి దారుణంగా ఉంటుంది. డాక్టర్లు తప్పు చెప్పారేమో, పరికరం సరిగా పనిచేయలేదేమో.. అంటూ అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఇక ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల వల్ల మానసికంగా తీవ్ర ఇబ్బందికి గురవుతారు. అందుకే తమ పరిస్థితిని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు.

జడ్జ్ చేస్తారన్న భయం..

కొవిడ్ 19 వచ్చిన వారి మీద గ్రామాల్లో, అపార్ట్‌మెంట్లలో చూపించిన వివక్ష కారణంగా తాము పాజిటివ్ అని తెలియగానే జనాలు జడ్జ్ చేయడం ప్రారంభిస్తారనే భయం పుట్టుకొస్తుంది. మాస్కులు పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరిగినందుకు వైరస్ అంటుకుందని ఆరోపిస్తారని ఆందోళన పడతారు. తమ తప్పుల కారణంగా తమకు వైరస్ సోకిందని అందరూ ఎత్తి చూపుతారనే భయం వల్ల సిగ్గుతో తలదించుకోవాల్సివస్తుందని అనుకుంటారు. ఇతరులు ఏమంటారోనన్న భయంతో టెస్టులు చేయించుకోకుండా, ఒకవేళ చేయించుకున్నా బయటికి చెప్పడానికి సంకోచిస్తారు.

ఆర్థిక సమస్యలతో భయం..

ఇంట్లో కూర్చుని పనిచేస్తూ సంపాదించగల సౌకర్యం అందరికీ ఉండదు. కొందరికి బయటకెళ్లి పనిచేస్తేనే గానీ రోజు గడవని పరిస్థితి. అలాంటి వారికి ఎవరికైనా పాజిటివ్ వచ్చిందంటే వారు చెప్పుకోవడానికి సంకోచిస్తారు. ఎందుకంటే వారికి పాజిటివ్ అని తెలిస్తే వాళ్లను పనికి రానివ్వరు. పనికి రానివ్వకపోతే డబ్బులు రావు. దీని వల్ల కరోనా కంటే ముందు కటిక పేదరికంతో చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక సమస్యలకు భయపడి టెస్టులు చేయించుకోవడానికి నిరాకరిస్తారు.

ఇవి కాకుండా వ్యక్తిగత సమస్యలు ఎన్నో ఉండటంతో వారు బయటికి చెప్పుకోలేరు. కానీ గ్రామాల్లో, పల్లెల్లో పరిస్థితి వేరేలా ఉంది. ఎవరూ ముందుకు రావడం లేదని తమ వంతు బాధ్యతగా ఆశావర్కర్లు ఇంటింటికీ తిరిగి టెస్టులు చేస్తున్నారు. వారు అలా టెస్ట్ చేయడానికి వెళ్లినపుడు వారికి తిట్లతో స్వాగతం పలుకుతున్నారు. కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆశా వర్కర్లను వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. బయట తిరగొద్దు, మాస్క్ కట్టుకోవడం లేదని చెబుతుంటే వారితో దుర్భాషలాడుతున్నారు. వ్యాధిని బయటపెట్టుకోలేకున్నా సాయం చేద్దామనుకునే వాళ్లను దూషిస్తున్నారు. ఇలా చేయడం ఏ మాత్రం సబబు కాదు. ఇదేమీ సిగ్గు పడాల్సిన వ్యాధి కాదు. అందరికీ వచ్చేదే.. కాబట్టి మీరు కూడా టెస్ట్ చేయించుకుని మీతో పాటు మీ కుటుంబాన్ని, ఇతరుల ఆరోగ్యాలను కూడా కాపాడుకోండి.

Advertisement

Next Story

Most Viewed