- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వకీల్ సాబ్ : రివ్యూ
దిశ, సినిమా: మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత.. తన సినీ పునరాగమనంపై అభిమానులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చేందుకు రంగంలోకి దిగిన పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’తో వెండితెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందుకోసం బాలీవుడ్‌లో హిట్ మూవీ ‘పింక్’ రీమేక్‌ను ఎంచుకున్న పవన్.. యూత్‌లో తనకున్న మాస్ ఇమేజ్‌కు సంబంధంలేని కథతో ప్రయోగం చేశాడనే చెప్పొచ్చు. అయితే తెలుగులో ఏ హీరోకు లేనంత ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్‌కు, ఇప్పుడు పొలిటికల్ ఇమేజ్ కూడా యాడ్ అయ్యింది. ఈ క్రమంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేనాని నుంచి వచ్చిన సినిమా.. యూత్‌ను మెప్పించగలిగిందా? కొన్నేళ్లుగా యాక్టింగ్‌కు దూరమైన పవన్.. తన మునుపటి గ్రేస్‌ను చూపించగలిగాడా? తన పొలిటికల్ కెరీర్‌కు ఈ సినిమా ఏమైనా మైలేజ్ ఇస్తుందా తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా ప్రకటించినప్పటి నుంచి పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. అయితే మంచి కమర్షియల్ సినిమాతో ఎంట్రీ ఇస్తాడనుకుంటే.. ‘పింక్’ సినిమా రీమేక్ ఎంచుకోవడం పట్ల ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురైనప్పటికీ, మొత్తానికి రీఎంట్రీ ఇస్తున్నాడులే అని సరిపెట్టుకున్నారు. ఈ మేరకు డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా వారి అంచనాలను వమ్ము చేయలేదు. సగటు పవన్ అభిమాని కోరుకునే కమర్షియల్ అంశాలన్నీ కథలో చేర్చి న్యాయం చేశాడనే చెప్పొచ్చు. ఇక పవన్ నటన విషయానికొస్తే.. అదే గ్రేస్, వాకింగ్ స్టైల్ అండ్ మేనరిజంతో ఫ్యాన్స్‌కు ఐఫీస్ట్ ఫీలింగ్ ఇచ్చాడు. ఇక తన కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో అక్కడక్కడా పొలిటికల్ డైలాగ్స్ పేలుస్తూ జనసైనికుల్లో ఉత్సాహం నింపాడు. ప్రభుత్వ వైఫల్యాలపై చురకలంటించాడు. ఈ మేరకు తన రీఎంట్రీకి, పొలిటికల్ కెరీర్‌కు కావలసిన అంశాలన్నీ దట్టించి ఫుల్ ప్యాక్ రెడీ చేశారు మేకర్స్.
కథ విషయానికొస్తే.. ముగ్గురు యువతులు వేముల పల్లవి( నివేదా థామస్), జరీనా(అంజలి), దివ్య (అనన్య నాగళ్ల) హైదరాబాద్ నగరంలో ఒకే చోట ఉంటూ ఉద్యోగాలు చేస్తుంటారు. స్వతంత్ర భావాలు కలిగిన ఆ అమ్మాయిలంతా మధ్యతరగతి కుటుంబ నేపథ్యం ఉన్నవారే. ఒకరోజు రాత్రి ఈ ముగ్గురు ట్రావెల్ చేస్తున్న కారు బ్రేక్ డౌన్ కావడంతో.. అదే రూట్‌లో వచ్చిన ఓ కారులో లిఫ్ట్ అడిగి ఎక్కుతారు. అందులో హై ప్రొఫైల్‌కు చెందిన అబ్బాయిలు ఉండటం, ఆ కారు నేరుగా రిసార్ట్‌కు వెళ్లడం, అక్కడ యువతుల్లో ఒకరైన పల్లవిపై సెక్సువల్ హరాస్ చేయడంతో తను మందు బాటిల్‌తో ఎంపీ కొడుకు తల పగలగొట్టడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోతాయి. ఈ సంఘటనతో కంగుతున్న యువకులు, ఆ ముగ్గురు యువతులపై పగ తీర్చుకోవాలనుకుని బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో పల్లవి పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేసినా, పోలీసులు యాక్షన్ తీసుకోరు. పైగా పల్లవినే ప్రాస్టిట్యూట్‌గా చిత్రీకరిస్తూ ఎంపీ కొడుకుపై దాడి కేసులో తనను అరెస్ట్ చేస్తారు. అంతేకాదు పొలిటికల్ ఇన్‌ఫ్లూయన్స్‌తో తన కేసును ఏ లాయర్ టేకప్ చేయకుండా ప్లాన్ చేసి, బెయిల్ రాకుండా చేస్తారు. ఈ నేపథ్యంలో అదే కాలనీలో రెంట్‌కు దిగిన కొణిదెల సత్యదేవ్(వకీల్ సాబ్) ఈ యువతులకు సాయం చేసేందుకు ముందుకొస్తాడు. అసలు ఈ సత్యదేవ్ ఎవరు? తను జనాల కోసం ఎలాంటి పోరాటాలు చేశాడు? ఈ క్రమంలో తన నల్లకోటును ఎందుకు వదిలేశాడు? కోర్టులో తన వాదనలతో ఆ యువతులను ఎలా రక్షించాడన్నదే మిగతా కథ.
అప్పటి దాకా సత్యదేవ్.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో సో..సో..గా నడిచిన కథ సెకండాఫ్‌లో సీరియస్‌నెస్ తీసుకుంటుంది. ముఖ్యంగా కోర్టు సీన్లలో డిఫెన్స్ లాయర్ ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్ వాదించే సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయి. పింక్ సినిమాతో పోలిస్తే.. తెలుగులో కోర్టు డ్రామాలో కొంచెం కామెడీ యాడ్ చేయడం ప్రేక్షకులకు రిలీఫ్‌నిచ్చింది. ఈ క్రమంలో అమ్మాయిల పట్ల సమాజ వైఖరిపై పవన్ లేవెనెత్తిన అంశాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. స్వతహాగా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారికైతే కళ్లు చెమ్మగిల్లక మానవు. మొత్తానికి కోర్టులో న్యాయం జరగడంతో కథ సుఖాంతం అవుతుంది.
సమాజ వైఖరిని నిగ్గదీసిన ప్రశ్నలు..
ఏ అమ్మాయి అయినా ఫ్రెండ్లీగా అబ్బాయిలతో కలిసి రెస్టారెంట్‌కు లేదా రిసార్ట్‌కు వెళ్తే.. తనను ముట్టుకోవడానికి, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టేనా? ‘అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్.. అదే అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడితే కొంపలు ముంచే క్యారెక్టరా? మన ఇంట్లో గడియారంలోని చిన్న ముల్లు కూడా అమ్మాయిలు లేట్‌గా ఇంటికొస్తే వారి క్యారెక్టర్‌ను డిసైడ్ చేస్తోంది. అబ్బాయిలు రాత్రిపూట బయటతిరిగితే సరదా. అమ్మాయిలు రాత్రి పూట ఒంటరిగా వెళ్తుంటే మాత్రం సొసైటీ నిండా వంకర చూపులు, తప్పుడు మాటలే! అమ్మాయిల వస్త్రధారణ వల్ల అబ్బాయిలు టెంప్ట్ అవుతున్నారని చెప్తున్నారు సరే.. మరి చిన్న పిల్లలు, ముసలివాళ్ల మీద కూడా లైంగికదాడులు జరుగుతున్నాయి కదా? దానికేం సమాధానం చెప్తారు. ఈ క్రమంలో ‘ఆడదంటే బాత్‌రూమ్‌లో గోడ మీదున్న బొమ్మ కాదురా, నిన్ను కనిపెంచిన అమ్మ’ అని చెప్పే డైలాగ్స్ థియేటర్స్‌లో విజిల్స్ వేయిస్తాయి.
నటీనటుల, సాంకేతివర్గం పనితీరు : పవన్ లాయర్ పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించగా.. ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి తమ పాత్రలకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చారు. ఇక పవన్ వైఫ్‌గా నటించిన శ్రుతి హాసన్ తన పాత్రకు న్యాయం చేసింది. తమన్ సంగీతం, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి.