- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ లైమ్‌లైట్.. జనసేన లైట్‌లైట్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … జనసేన పార్టీని స్థాపించి సినిమాలకు దూరంగా ఉన్నాడు. 2019 ఎన్నికల సమయానికి ముందు నుంచి కేవలం అధికారమే లక్ష్యంగా ప్రచారం చేశాడు. రంగుల ప్రపంచం నుంచి వచ్చింది… మీ కోసమేనని… మళ్లీ అక్కడకు వెళ్లేది లేదని… ప్రజాక్షేమమే జనసేనాని లక్ష్యమని… సమన్యాయం చేయడం నా ఉద్దేశమని పవర్ ఫుల్ డైలాగ్‌లతో జనాన్ని మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ జరిగిందేంటి? దక్కింది ఒక్క సీటు, ఒకే ఒక్క సీటు. దీంతో షాక్ అయిన పవన్ కొన్ని రోజులు ఏపీ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీని ఆగ్రహావేశాలతో విమర్శించినా తర్వాత చల్లబడిపోయాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తాం అని, అందుకే బీజేపీతో చేతులు కలుపుతున్నాం అని ప్రకటించాడు. ప్రధాని మోడీ నాయకత్వంలో పని చేస్తూ… ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు తీరుస్తూ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చాడు.
మళ్లీ జరిగిందేంటి? పవన్ యూ టర్న్ తీసుకున్నాడు. జనసేనానిగా రంగుల ప్రపంచానికి దూరంగా ఉంటానన్న పవన్ మళ్లీ పవర్‌స్టార్‌గా మారిపోయాడు. పింక్ రీమేక్‌తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. దీనిపై కలత చెందిన ఆ పార్టీ సినియర్ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ పార్టీకి గుడ్‌బై చెప్పాడు. ‘మీరు మాటకు కట్టుబడి ఉండకుండ… మళ్లీ సినిమాలు చేస్తున్నారు.. అందుకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నాను’ అని ప్రకటించాడు. ఇప్పటికే పార్టీలో చాలామంది ప్రముఖులు రిజైన్ చేయగా… లక్ష్మి నారాయణ కూడా చేజారిపోయాడు. పవన్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తే… పాలిటిక్స్‌లో జరిగింది ఇది. కానీ పవన్ ఏమని సమర్ధించుకున్నాడు… పార్టీకి ఫండ్స్ కావాలి అంటే నేను సినిమాలు చేయాలి? అని. ఓకే అనుకుందాం. కానీ సినిమాలు చేస్తే పార్టీని నడిపించేది ఎవరు? జనసైనికులకు దారి చూపేది ఎవరు? జనసేనానే లేకపోతే వాళ్లు మాత్రం ఏం చేస్తారు?
ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్త… పవన్ మూడు సినిమాలు లైన్లో పెట్టాడు అని. కానీ.. పవన్ ఐదు సినిమాలు చేయబోతున్నాడు అని మరో వార్త వినిపిస్తుంది. పవర్ స్టార్ 26వ చిత్రంగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న పింక్ సినిమా రాబోతుండగా 27వ చిత్రం క్రిష్ డైరెక్షన్ లో 28వ చిత్రం హరీష్ శంకర్ డైరెక్షన్‌లో అని అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ… మరో రెండు సినిమాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పవన్ 29వ సినిమా రానుండగా 30వ చిత్రం కిశోర్ కుమార్ డైరెక్షన్‌లో రానుంది. ఈ సినిమాలు పూర్తి చేసి పవన్ కళ్యాణ్ రాజకీయాలపై కాన్సంట్రేట్ చేస్తాడని టాక్. అయితే ఈ సినిమాలన్నీ పూర్తి చేయాలంటే 2023 వరకు సమయం కావాలి. అంటే మళ్లీ ఎన్నికల టైం వచ్చేస్తుంది. అలాంటప్పుడు పాలిటిక్స్ మీద సమయం కేటాయిస్తే వచ్చే లాభం ఏమైనా ఉందా? అనేది విశ్లేషకుల ప్రశ్న.
ఒక నాయకుడికి ఎంత పటిష్ట వ్యూహం ఉండాలి? … ఎన్నికల్లో నెగ్గాలంటే ఎన్ని పై ఎత్తులు వేయాలి? ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలి? ఇవేవి పవన్‌లో కనిపించడం లేదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారపీఠాన్ని అధిరోహించాడంటే ఆ విజయం వెనుక ఎంత కష్టం… ఎంత వ్యూహం… ఎంత తపన ఉంది. ఐదేళ్లు పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లి ప్రజల్లో తిరిగితేనే ఇది సాధ్యం అయింది. దాదాపు ఐదేళ్ల కష్టం జగన్ కు సీఎం పదవిని గిఫ్ట్‌గా ఇచ్చింది. అప్పటి ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ జగన్ అప్పటి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాడు. ప్రతీ విషయంలోనూ బాబుకు యాంటిగా మారిన జగన్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కావని, ‘జగన్ అను నేను’ సీఎం అయితే మీ కష్టాలన్నీ పోతాయనే భరోసా ఇచ్చాడు. అందుకే జగన్ … ప్రజల ఆదరణ పొందాడు. ప్రజానాయకుడిగా ఏపీ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నాడు.
అంతేకాని లైమ్‌లైట్‌లో ఉంటూ కెమెరా… రోల్ … యాక్షన్ అంటే ఫలితం ఉండదని హెచ్చరిస్తున్నారు. జనానికి న్యాయం చేయాలనుకునే లీడర్ జనాలకు దూరంగా ఉంటే కష్టమేనని జనం మధ్యలో జనసేనానిగా సేవలందించాలని హితవు పలుకుతున్నారు. జగన్‌లా కష్టపడితేనే ఐదేళ్లు తాపత్రయపడితేనే, జనానికి సేనానిగా మారగలడని చెబుతున్నారు.