ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

by srinivas |
ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు: పవన్ కల్యాణ్
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయడంతో పాటు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉండవని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఇంటర్‌లో ఇదివరకు ఫెయిలైన విద్యార్థులను కూడా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ.. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తులను గౌరవించినందుకు ఏపీ సర్కారును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు.

నిత్యం వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఇంతకుముందు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఘోర తప్పిదంగా భావించారు. రవాణా ఇబ్బందులున్న సమయంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ప్రయాసతో కూడిన పని, అలాగే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు వెళ్లే సమయంలోనూ, వచ్చే సమయంలోనూ, బయట తిరిగే సమయంలో సామాజిక దూరం అసాధ్యం. విద్యార్థులు గుంపులు గుంపులుగా తిరుగుతారు. లక్షలాది పిల్లల ప్రాణాలతో చెలగాటమాడవద్దన్న జనసేన సూచనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహేతుకంగా స్పందించిందని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు ఏపీ సీఎం జగన్‌కు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పరీక్షలు రద్దు చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ జనసేన అభినందిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed