కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

by Anukaran |   ( Updated:2021-10-22 08:28:30.0  )
pawan kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: దామోదరం సంజీవయ్య స్మారక భవన నిర్మాణానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రకటన విడుదల చేశారు. దేశం గర్వించదగ్గ మహానీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ, ఆయన కీర్తిని తరతరాలకు తెలిసేలా కర్నూలు జిల్లాలోని ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని జనసేనాని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య.. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలకు ఆధ్యుడిగా చెప్పుకుంటారని గుర్తుచేశారు.

అంతేగాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి అణగారిన వర్గాల నేత అని.. కడు పేద కుటుంబంలో జన్మించి అసాధారణ వ్యక్తిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నాటి సమకాలీన కుటిల నీతి కారణంగా రెండేళ్లకే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చినా.. ఆ రెండేళ్ల కాలంలో ఆయన సాధించిన విజయాలు, ప్రజలకు అందించిన అపూర్వసేవలు చిరస్మరణీయం అని అన్నారు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వెనుకుబాటుతనం రూపుమాపడానికి బీజాలు వేశారని వెల్లడించారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed