వలంటీర్లు బాధ్యతగా వ్యవహరించాలి: పవన్ కల్యాణ్

by srinivas |
వలంటీర్లు బాధ్యతగా వ్యవహరించాలి: పవన్ కల్యాణ్
X

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేతతో పాటు ప్రజల వివరాలు ప్రభుత్వానికి అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నిరోధక పోరాటంలో వలంటీర్ల సేవలు అద్వితీయమైనవి. పల్లెల్లోకి ఎవరెవరు వచ్చారు? ట్రావెల్ రికార్డు ఉన్న వారు వైద్యపరీక్షలు చేయించుకున్నారా? లేదా?.. ప్రజలంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారా? లేదా?. సామాజిక దూరం పాటిస్తున్నారా? లేదా? వంటి వివరాలన్నీ వలంటీర్లే పర్యవేక్షిస్తున్నారు.

అలాంటి వలంటీర్లకు ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుకలంటిస్తూనే.. అభినందించారు. కరోనా నిరోధంపై పోరాటంలో గ్రామ వలంటీర్లు సమర్థంగా వ్యవహరించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయని అన్నారు. కొన్ని వేల మంది ప్రజలు బయటికి వచ్చి రేషన్ దుకాణాల ముందు గుమికూడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో జనం రోడ్ల మీదికి రాకుండా వలంటీర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.

ఇంటి వద్దకే రేషన్ సరుకులను వలంటీర్ల ద్వారా అందజేస్తామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలాకాలం కిందటే ప్రకటించిందన్న ఆయన వాస్తవంలో పరిస్థితి అలా లేదని చెప్పారు. వలంటీర్లు మరింత కష్టపడాలని సూచించిన పవన్, లాక్ డౌన్ విజయవంతం చేయడంలో వలంటీర్లే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నివారణలో వలంటీర్ల పాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు.

Tags : pawankalyan, janasena volunteer system, lockdown, corona virus, covid-19, andhrapradesh

Advertisement

Next Story

Most Viewed