ఎంజీఎంలో మంత్రిని కూడా కేర్ చేస్తలేరు

by Anukaran |   ( Updated:2020-07-24 23:04:03.0  )
ఎంజీఎంలో మంత్రిని కూడా కేర్ చేస్తలేరు
X

దిశ ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కరోనా పేషెంట్లకు పౌష్టికాహారం కాదు కదా.. అన్నం కూడా దొరకడం లేదు. తాగేందుకు నీళ్లు కూడా లేక అవస్థ పడుతున్నట్లు రోగులు ఆవేదన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయత్రం వరకు సరైన తిండి పెట్టడం లేదని.. ఆకలితో అలమటిస్తున్నాం. బుక్కెడు బువ్వ పెట్టమని వేడుకున్నా.. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు, కుటుంబీకులు కంటతడి పెడుతున్నారు. మహమ్మారికి తోడు కడుపు మాడ్చుకుని ఆస్పత్రిలోనే రోజులు గడుపుతున్నామని బాధితులు వాపోతున్నారు. కరోనా రోగులకు ఉదయం, సాయంత్రం పాలు, ఒక్క పూట బ్రెడ్ ఉదయం బ్రేక్ ఫాస్ట్. మధ్యాహ్నం రెండు కూరలు సాంబార్ ఒక గుడ్డు అన్నం, ఒక పండు ఇవ్వాలి. 3, 4 గంటలకు డ్రై ఫ్రూట్స్.. కానీ స్నాక్స్ ఇవ్వాలి.. రాత్రి రెండు కూరలతో భోజనం పెట్టాలి. కానీ ఎంజీఎంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆస్పత్రిలోని పేషెంట్లు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.

ఆస్పత్రిలో రెండు వందల మంది పేషెంట్లు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించడం కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో సుమారు రెండు వందల మంది చికిత్స‌ పొందుతున్నారు. అయితే కరోనా సోకిన రోగులకు ఉదయం టిఫిన్ అందడం లేదని.. రాత్రి అన్నం కూడా పెట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆకలి తట్టుకోలేక బయటకు వెళ్దామంటే అనుమతి ఇవ్వడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.‌ కరోనాను జయించాలంటే పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని.. పౌష్టికాహారం తినాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆస్పత్రిలో మాత్రం పౌష్టికాహారం మాటేమిటో కానీ తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడం లేదని రోగులు వాపోతున్నారు. ఆకలి అవుతోంది సారూ అని మొత్తుకున్నా అధికారులు తమ గోడు వినడం లేదని ఆరోపిస్తున్నారు.

స్పందించని అధికారులు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు సరైన ఆహారం అందని విషయమై సూపరింటెండెంట్ శ్రీనువాస్ ను కలిసేందుకు ప్రయత్నించిన అనుమతి‌ ఇవ్వడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ఆస్పత్రిలో వాస్తవ పరిస్థితులు గమనించి సమయానికి రోగులకు నాణ్యమైన ఆహారం అందించేలా చూడాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

మంత్రి మాటలేమాయే?
ఎంజీఎం ఆస్పత్రిలోని కరోనా చికిత్స కేంద్రంలో రోగులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పదేపదే సమీక్షలు పెట్టి చెప్పి వారం రోజులు గడుస్తోంది. ఏర్పాట్ల మాట పక్కన పెడితే.. కనీసం రోగులకు అన్నం కూడా అందడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎంజీఎంలో కరోనా సోకిన బాధితులకు పౌష్టికాహారం ఇవ్వటం కోసం ప్రభుత్వం ఒక్కరికి రూ.200 ఇస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed