కనిపించని పంచాయతీ కార్యదర్శులు.. పట్టించుకోని అధికారులు!

by Sridhar Babu |   ( Updated:2021-12-15 12:02:04.0  )
కనిపించని పంచాయతీ కార్యదర్శులు.. పట్టించుకోని అధికారులు!
X

దిశ, అశ్వాపురం : గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పరిచడమే కాకుండా సమగ్ర సమాచారం సేకరించి ప్రజాప్రతినిధులకు అందించడానికి.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించి ఇటీవలే వారికి జీతాలు సైతం పెంచిన చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ పరిధిలోనే నివసిస్తూ గ్రామ పంచాయతీ ఆధీనంలో పనిచేయాలి. సర్పంచ్‌ ఆదేశాల మేరకు పంచాయతీని సమావేశ పరుస్తూ గ్రామ పంచాయతీ సమావేశాలు, ఇతర కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి. అయితే, ఈ నిబంధనలను తుంగలో తొక్కి వాటికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు మండలంలోని కొందరు పంచాయతీ కార్యదర్శులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వాపురం మండలంలో 24 గ్రామ పంచాయతీలుండగా సగానికి పైగా పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో ఉండటం లేదని ఆరోపణలున్నాయి.

మల్టీపర్పస్ వర్కర్లలోనే ఒకరిని గుమాస్తాగా ఏర్పాటు చేసుకొని సగం బాధ్యతలు వారికే అప్పగిస్తున్నారు. ఈ తీరు మండలంలో ప్రత్యక్షంగా కనబడుతోంది. దీంతో ఇప్పటికీ కొన్ని పంచాయతీల్లో గుమాస్తాలదే హవా కొనసాగుతోంది. దీనంతటికి కారణం మండల పంచాయతీ అధికారుల నిర్లక్షమేనమి స్పష్టమవుతోంది. కమీషన్లకు కక్కుర్తి పడి కార్యదర్శులను పర్యవేక్షించాల్సిన మండల అధికారులే వారు చేస్తున్న తప్పులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఉదాహరణకు మల్లెల మడుగు గ్రామపంచాయతీ కార్యదర్శి తన ఆరోగ్యం బాగోలేదని పదిహేను రోజులు సెలవు పెట్టి పాలకవర్గానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మూడున్నర నెలలు విధుల్లో చేరకపోయినా వారిపై ఏ మాత్రం చర్యలు తీసుకోలేదన్న అంశం పలు అనుమానాలకు దారితీస్తుంది. గతంలో ఇదే మల్లెల మడుగు పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల ఉపాధి హామీ పనుల్లో కూలీలు పనికి రాకముందే వచ్చినట్టు హాజరువేసుకున్న ఘటన డీఆర్డీఓ ఎం.మధుసూదనరాజు వద్దకు చేరింది. అయినా, ఆ కార్యదర్శిపై చర్యలు తీసుకోలేదు. సుమారు రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న పంచాయతీపై భౌగోళికంగా కనీసం అవగాహన లేని పంచాయతీ కార్యదర్శి మాకేందుకని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీరి తీరుపై మండల అధికారులకు ఫిర్యాదు చేస్తే అట్టి అధికారులే వారిని చిన్నపిల్లలని సమర్ధిస్తున్నారు. పంచాయతీ విధులను బాధ్యతారహితంగా వ్యవహరించడమే కాక వారి విధులను సైతం మల్టీపర్పస్ వర్కర్లకే అప్పగిస్తూ వాళ్ళు మాత్రం మొక్కుబడికి కార్యాలయానికి వస్తుండటంతో అలాంటి పంచాయతీ కార్యదర్శులు మాకెందుకని, ఇటువంటి వారిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమైందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఓ పంచాయతీ కార్యదర్శి ఓ కీలక మండల స్థాయి ప్రజాప్రతినిధితో మర్యాద లేకుండా పిలిచారని దానికి వారు భాదపడినట్టు సమాచారం. ఇన్ని జరుగుతున్నా మండల అధికారులు మాత్రం కార్యదర్శులను వెనకేసుకొనిరావడమేమిటని ఇందులో ఉన్న అంతర్యమేమిటోనని ప్రతిఒక్కరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారివల్ల బాధ్యతగా ఉత్సాహంగా పనిచేసే కార్యదర్శులకు చెడ్డపేరు వస్తుందని తోటి కార్యదర్శులే అంటున్న పరిస్థితి నెలకొంది. తక్షణమే ఇటువంటి బాధ్యతలేని కార్యదర్శులపై జిల్లా అధికారులు చర్యలు తీసుకొని వారి స్థానంలో నూతన బాధ్యతగల నూతన పంచాయతీ కార్యదర్శులను నియమించి గ్రామాలని అభివృద్ధి దిశలో నడిపించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed