భారత్‌తో సంబంధాల పునరుద్ధరణపై నేడు పాక్ నిర్ణయం

by vinod kumar |
pakistan mulls to revive trade with india
X

న్యూఢిల్లీ: గతేడాది ఆగస్టులో జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిన తర్వాత మనదేశంతో పాకిస్తాన్ అన్ని సంబంధాలను నిలిపేసుకుంది. కానీ, వాటిని మళ్లీ పునరుద్ధారించాలన్న ప్రస్తుతం ఆలోచనలు చేస్తున్నది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పాకిస్తాన్ క్యాబినెట్ వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి. భారత్ నుంచి పంచదార, పత్తి దిగుమతులపై క్యాబినెట్ కమిటీ ఈ రోజు నిర్ణయం తీసుకోనుందని తెలిపాయి.

సరిహద్దులో శాంతి కోసం ఉభయ దేశాల అభిప్రాయాలు కలిసిన తర్వాత ఉభయ దేశాల ప్రధానులు పరస్పరం సానుకూల వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ రాశారు. పాక్‌తో భారత్ సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నదని, కానీ, అందుకు నమ్మకమైన వాతావరణం అవసరమని, ఉగ్రవాద రహిత పరిస్థితులు అవసరమని భారత ప్రధాని మోడీ ఆ లేఖలో నొక్కి పేర్కొన్నారు.

తాజాగా ఆ లేఖకు సమాధానంగా పాక్ పీఎం రాసిన లేఖలో దీనికి సమాధానం రాశారు. పాక్ ప్రజలూ భారత్‌తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ సహా ఇతర సమస్యలు ఇరుదేశాల మధ్య పరిష్కారమైతే శాంతి స్థిరత్వాలకు, దక్షిణాసియాలో శాంతి భద్రతలకు ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఫలవంతమైన చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరముందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed