పాక్‌కో విజయం

by Harish |   ( Updated:2024-06-11 18:32:06.0  )
పాక్‌కో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత విజయం రుచిచూసింది. అదికూడా పసికూన కెనడాపై చెమటోడ్చితే తొలి విజయం దక్కింది. న్యూయార్క్ వేదికగా మంగళవారం జరిగిన గ్రూపు ఏ మ్యాచ్‌లో కెనడాపై 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 106/7 స్కోరు చేసింది. ఆరోన్ జాన్సన్(52) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి పాక్ శ్రమించాల్సి వచ్చింది. 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిజ్వాన్(53 నాటౌట్) చివరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో పాక్ తర్వాతి రౌండ్ ఆశలను సజీవంగా ఉంచుకున్నా.. అవకాశాలు మాత్రం సంక్లిష్టంగానే ఉన్నాయి.

రిజ్వాన్ రాణించడంతో..

లక్ష్యం 107 పరుగులే అయినా పిచ్ ప్రతికూలంగా ఉండటంతో పాక్ ఛేదన సాఫీగా సాగలేదు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి 17.3 ఓవర్లు తీసుకుంది. ఓపెనర్ సైబ్ ఆయుబ్(6) త్వరగానే వికెట్ పారేసుకున్నాడు. అయితే, మరో ఓపెనర్ రిజ్వాన్ మాత్రం క్రీజులో పాతుకపోయాడు. అతనికి కెప్టెన్ బాబర్ ఆజామ్ కూడా తోడయ్యాడు. వీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే, కెనడా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వేగంగా పరుగులు సాధించలేకపోయారు. డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. దూకుడుగా ఆడితే అసలుకే మోసం వస్తుందని భావించిన రిజ్వాన్, బాబర్ ఆచితూచి ఆడుతూనే జట్టును లక్ష్యానికి చేరువ చేశారు. రెండో వికెట్‌కు వీరు 63 పరుగులు జోడించారు. బాబర్(33)ను అవుట్ చేసిన డిల్లాన్ హేలిగర్ ఈ జోడీని విడదీశాడు. కాసేపటికే ఫకర్ జమాన్(4) కూడా వెనుదిరిగాడు. అయితే, క్రీజులో పాతుకపోయిన రిజ్వాన్(53 నాటౌట్) మిగతా పని పూర్తి చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెనడా బౌలర్లలో డిల్లాన్ హేలిగర్ 2 వికెట్లు, గోర్డాన్‌కు ఒక్క వికెట్ దక్కింది.

ఆకట్టుకున్న ఆరోన్ జాన్సెన్

అంతకుముందు కెనడా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఆరోన్ జాన్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ వంటి బలమైన బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొని నిలబడ్డాడు. ధాటిగానే ఆడిన అతను నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో అలరించాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, మరో ఎండ్‌లో అతనికి సహకారం కరువైంది. పాక్ బౌలర్లు అమిర్, హారిస్ రవూఫ్ ధాటికి మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. దీంతో ఒంటరి పోరాటం ఆరోన్ జాన్సెన్(52) చివరికి నసీమ్ షా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ సాద్ బిన్ జాఫర్(10), కలీమ్ సనా(13 నాటౌట్) ఆచితూచి ఆడటంతో కెనడా ఆలౌట్ ప్రమాదం నుంచి బయటపడటమే కాకుండా 100 స్కోరు దాటింది. పాక్ బౌలర్లలో అమిర్, రవూఫ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, నసీమ్ షాలకు చెరో వికెట్ పడింది.

స్కోరుబోర్డు

కెనడా ఇన్నింగ్స్ : 106/7(20 ఓవర్లు)

ఆరోన్ జాన్సన్(బి)నసీమ్ షా 52, నవ్‌నీత్(బి)అమిర్ 4, పర్గత్ సింగ్(సి)ఫకర్ జమాన్(బి)షాహీన్ అఫ్రిది 2, నికోలస్ కిర్టన్ రనౌట్(ఇమాద్ వసీమ్) 1, శ్రేయాస్ మొవ్వ(సి)రిజ్వాన్(బి)రవూఫ్ 2, రవీందర్‌పాల్(సి)ఫకర్ జమాన్(బి)రవూఫ్ 0, సాద్ బిన్ జాఫర్(సి)రిజ్వాన్(బి)అమిర్ 10, కలీమ్ సనా 13 నాటౌట్, డిల్లాన్ హేలిగర్ 9 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 13.

వికెట్ల పతనం : 20-1 29-2, 43-3, 54-4, 54-5, 73-6, 87-7

బౌలింగ్ : షాహీన్ అఫ్రిది(4-0-21-1), నసీమ్ షా(4-0-24-1), అమిర్(4-0-13-2), హారిస్ రవూఫ్(4-0-26-2), ఇమాద్ వసీమ్(4-0-19-0)

పాకిస్తాన్ ఇన్నింగ్స్ : 107/3(20 ఓవర్లు)

రిజ్వాన్ 53 నాటౌట్, సైమ్ అయూబ్(సి)శ్రేయాస్ మొవ్వ(బి)డిల్లాన్ హేలిగర్ 6, బాబర్ ఆజామ్(సి)శ్రేయస్ మొవ్వ(బి)డిల్లాన్ హేలిగర్ 33, ఫకర్ జమాన్(సి)దిల్‌ప్రీత్ బజ్వా(బి)గోర్గాన్ 4, ఉస్మాన్ ఖాన్ 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9.

వికెట్ల పతనం : 20-1, 83-2, 104-3

బౌలింగ్ : కలీమ్ సనా(3-0-21-0), జెరెమీ గోర్డాన్(3.3-0-17-1), డిల్లాన్ హేలిగర్(4-0-18-2), సాద్ బిన్ జాఫర్(4-0-23-0), జునైద్ సిద్ధిఖీ(3-0-28-0)



Advertisement

Next Story

Most Viewed