పాకిస్థాన్ కొత్త మ్యాప్ చెల్లుబాటు కాదు : భారత్

by Anukaran |   ( Updated:2020-08-04 11:50:26.0  )
పాకిస్థాన్ కొత్త మ్యాప్ చెల్లుబాటు కాదు : భారత్
X

దిశ, వెబ్ డెస్క్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కేబినెట్ పాకిస్థాన్ కొత్త మ్యాప్‌ను ఆమోదించడం హాస్యాస్పదమని భారత ప్రభుత్వం వ్యంగ్యాస్త్రాలు సందించింది. భారత భూభాగాలను తమవిగా చెప్పుకుంటూ చేస్తున్న ప్రకటనలకు చట్టబద్ధత, అంతర్జాతీయ విశ్వసనీయత లేవని స్పష్టంచేసింది.

అంతకుముందు ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తన మంత్రివర్గం పాకిస్థాన్ నూతన మ్యాప్‌ను ఆమోదించిందని.. దానిని ప్రపంచం ముందు పెడుతున్నామన్నారు. దీనిని పాకిస్థాన్ మంత్రివర్గం, ప్రతిపక్షాలు, కశ్మీరీ నాయకత్వం బలపరుస్తున్నట్లు ప్రకటించుకున్నారు.

ఆ మ్యాప్‌లో జమ్మూ-కశ్మీరు, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని జునాగఢ్, మనవడర్‌లతోపాటు సర్ క్రీక్ కూడా పాక్ లోని భాగాలేనని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తమ దేశానికి చెందిన గుజరాత్‌లోని భూభాగాలు, మా కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీరు, లడఖ్‌ తమవేనని అసమంజసంగా ప్రకటించుకోవడం, ఇది రాజకీయ ప్రహసనంతో కూడిన విన్యాసం. ఈ హాస్యాస్పద ప్రకటనలకు చట్టబద్ధమైన చెట్లుబాటు కానీ, అంతర్జాతీయ విశ్వసనీయత కానీ లేవు’ స్పష్టంచేశారు.

నిజానికి, ఈ కొత్త ప్రయత్నం కేవలం పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని బయటపెడుతోందని, క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహాయంతో భౌగోళిక విస్తరణ పట్ల ఆ దేశానికి ఉన్న తహతహను ధ్రువీకరిస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed