ఆ నలుగురు ఉగ్రవాదుల వెనుక పాక్ ఐఎస్ఐ

by Shamantha N |
ఆ నలుగురు ఉగ్రవాదుల వెనుక పాక్ ఐఎస్ఐ
X

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని నగ్రోటా సమీపంలో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన నలుగరు జైషే ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ భారీ స్కెచ్ వేసింది. పాక్ సరిహద్దు గుండా కశ్మీర్‌లో మోహరించిన భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని పుల్వామా కంటే పెద్ద విధ్వంసానికి వ్యూహం పన్నింది. ఈ మిషన్‌ను ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్‌కు అప్పజెప్పింది. భారత్‌లో విధ్వంసాన్ని సృష్టించడానికి అబ్దుల్ రవూఫ్ నలుగురు ఉగ్రవాదులను స్వయంగా ఎంచుకున్నాడు.

భారత సరిహద్దుకు సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన షాకార్‌గడ్ క్యాంప్‌లో కఠిన శిక్షణ పొందిన నలుగురు ఉగ్రవాదులను ఈ ఆపరేషన్‌కు రిక్రూట్ చేసుకున్నాడని కేంద్ర అధికారవర్గాలు తెలిపాయి. ఈ నలుగురు ఆత్మాహుతిదాడి, తక్కువ పేలుడు పదార్థాలతో మారణకాండను సృష్టించే నైపుణ్యాలను నేర్చుకున్నారు. నీటి మార్గాల ద్వారా పాక్ నుంచి కశ్మీర్ సాంబా సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబడ్డారు. అక్కడి నుంచి జమ్ములోని కథువాకు ట్రక్‌లో బయల్దేరారు. భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అస్ఘర్‌తో టచ్‌లో ఉన్నారు. మరో కశ్మీరీ వీరికి సహాయపడ్డాడని అధికారవర్గాలు వివరించాయి.

ఈ నలుగురు యాపిల్ ట్రక్కులో కశ్మీర్ లోయవైపు వెళ్తుండగా నగ్రోటా సమీపంలోని బన్ టోల్ ప్లాజా దగ్గర జమ్ము కశ్మీర్ పోలీసులు అడ్డుకుని తనిఖీలకు సిద్ధమవ్వగా డ్రైవర్ భయంతో ట్రక్కు దిగి పరుగులుతీశాడు. ఉగ్రవాదులు వెంటనే లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించగా, ట్రక్కులోని టెర్రరిస్టులు ససేమిరా అన్నారు. ఇస్లాం జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, జైష్ జిందాబాద్ అంటూ నినాదాలిచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఎదురుకాల్పుల్లో నలుగురూ హతమయ్యారు. ముంబయిలో ఉగ్రదాడి చేసిన 26/11 రోజునే కశ్మీర్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నారని నిఘా వర్గాలు ఇది వరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed