డీజీపీ పాత్ర పై ఆ ఎంక్వైరీ జరిపించాలి : పయ్యావుల కేశవ్

by srinivas |
డీజీపీ పాత్ర పై ఆ ఎంక్వైరీ జరిపించాలి : పయ్యావుల కేశవ్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర టీడీపీ కేంద్ర కార్యాలయం, పార్టీ నేత పట్టాభిరామ్ ఇంటిపై దాడి చేసిన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అధికారం ఉంది కదా అని దాడులకు పాల్పడతారా అంటూ ప్రశ్నించారు. ఈ దాడులను ప్రజలు సహించరన్నారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ నేతలు భయపడరని తేల్చి చెప్పారు. ఈ దాడిలో డీజీపీ పాత్రపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో ఒక వ్యక్తిని పట్టుకొని ఆరా తీస్తే అతడు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తిగా తేలిందన్నారు. అక్కడున్న అన్ని కెమెరాల్లో రికార్డ్ అయినట్లు వెల్లడించారు. దాడి జరిగి రెండు రోజులవుతున్నా దాడి చేసిన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కానీ బాధితుడు అయిన పట్టాభిని అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. న్యాయస్థానాల్లో అన్ని విషయాలు తేల్చుకుంటామని స్పష్టం చేశారు. కొంతమంది వల్ల మొత్తం వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. గంజాయి పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారని.. కానీ మన సీఎం మాత్రం స్పందించడం లేదు అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారంటూ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు.

Advertisement

Next Story