గాంధీలో నిండుకున్న ఆక్సిజన్ బెడ్స్.. వారు శవాలతో బేరమాడుతున్నరు!

by sudharani |
గాంధీలో నిండుకున్న ఆక్సిజన్ బెడ్స్.. వారు శవాలతో బేరమాడుతున్నరు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు నిండుకున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చివరి నిమిషంలో గాంధీకి కరోనా రోగులు రావడం వల్లే వెంటిలేటర్ బెడ్లకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. గురువారం బీఆర్‌కే భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 600 మంది పేషెంట్లు ఆక్సిజన్ పడకలపై చికిత్సలు పొందుతున్నారన్నారు. పాజిటివ్ వచ్చిన రోగులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలన్నారు. చివరి నిమిషంలో వస్తే వెంటిలేటర్ దొరకడం లేదని, దొరికిన బతకడం కష్టమని హెచ్చరించారు. ఎక్కవ మంది రోగులకు ఆక్సిజన్ బెడ్లు అవసరమవుతుండటంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కూడా ఉందని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బంది పరిస్థితి విషమించిన రోగులను, డబ్బుకట్టలేని రోగులను చివరి క్షణంలో గాంధీకి పంపిస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఇలాంటి విపత్కర సమయంలో శవాల మీద పేలాలు ఏరుకునేలా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆక్సిజన్, మందులను బ్లాక్‌లో విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలలిచ్చామన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి ఇంజక్షన్ల కేటాయింపు కాకుండా హైదరాబాద్‌లో చికిత్సలు పొందుతున్న విదేశీ పేషెంట్లు, వివిధ రాష్ట్రాల పేషెంట్లను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.

ఈ అంశంపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు వివరించినా స్పందన లేదన్నారు. చికిత్సలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 4 లక్షల రెమిడిసివిర్ ఇంజక్షన్‌లకు ఆర్డర్ పెడితే కేవలం 21,551 మాత్రమే సరఫరా చేశారని చెప్పారు. గుజరాత్‌కు 1.63 లక్షలు, మహారాష్ట్రకు 2 లక్షలు, ఢిల్లీకి 61 వేలు, మధ్యప్రదేశ్‌కు 92 వేల ఇంజెక్షన్లు సరఫరా చేసిన కేంద్రం రాష్ట్రం పట్ల వివక్షత చూపిస్తుందని నిరసన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ కేటాయింపుల్లో కూడా వివక్షత చూపుతూ 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సా నుండి ఇచ్చారని చెప్పారు. ఆక్సిజన్ కేటాయింపులు మార్చకపోతే రాష్ట్రంలో ఏర్పడే ఆక్సిజన్ కొరతకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్లను కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లకు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. దేశ ప్రజలందరికీ కాపాడే బాధ్యత కేంద్రం మీద ఉందని, రేట్లలో ఇంత వ్యత్యాసం ఉంటుందా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed