క్రిస్మస్‌కు ముందే ఆక్స్‌ఫర్డ్ టీకా

by Anukaran |
క్రిస్మస్‌కు ముందే ఆక్స్‌ఫర్డ్ టీకా
X

లండన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా ఈ ఏడాదిలోనే ప్రయోగాలు పూర్తి చేసుకుని ప్రజల ముందుకు రానున్నట్టు బ్రిటన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఏడాది చివరిలోనే బ్రిటన్ రెగ్యులేటరీ సంస్థలు ఆమోదం తెలిపే అవకాశమున్నదని, అటు తర్వాత ఆరు నెలల్లో యూకేలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేసే అవకాశాలున్నట్టు తెలిపాయి.

ఇప్పటికే ఈ టీకా డేటా పరిశీలనను మొదలుపెట్టినట్టు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుతం ఈ టీకా మూడో దశ ట్రయల్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టీకా యూకే నేషనల్ హెల్త్ సర్వీసె ఆమోదం పొందిన తర్వాత ఆరు నెలల్లోపే వయోజను(అడల్ట్)లకు టీకా అందించే కార్యక్రమం పూర్తవుతుందని యూకే ప్రభుత్వ శాస్త్రజ్ఞుల అభిప్రాయాలను ఆ దేశ మీడియా ఉటంకించింది. టీకా విజయవంతంగా కాగానే 10 కోట్ల డోసుల ఉత్పత్తికి ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుందని, రెగ్యులేటరీ ఆమోదం పొందగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొంది.

ఎమర్జెన్సీ వినియోగానికి దరఖాస్తులు చేసుకోండి: డబ్ల్యూహెచ్‌వో
అత్యవసరకాలంలో వినియోగానికి ప్రస్తుతం రెండు లేదా మూడో దశ ప్రయోగాల్లో ఉన్న టీకాల సంస్థలు ముందస్తు అర్హత కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సంప్రదించాలని ప్రకటించింది. యూఎన్ ఏజెన్సీలు, ప్రపంచ దేశాలూ డబ్ల్యూహెచ్‌వో ప్రీ క్వాలిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. భారత్ నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌లు ఈ ప్రీక్వాలిఫికేషన్ ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారవర్గాలు తెలిపాయి.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివద్ధి చేసిన టీకా ‘కొవిషీల్డ్’ మూడో దశ ట్రయల్స్‌ను సీరం నిర్వహిస్తుండగా, దేశీయంగా టీకా అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ ఇప్పటికే రెండో దశ ట్రయల్స్ ముగించుకుని మూడో దశకు దరఖాస్తు చేసుకుంది. కాగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ రష్యా టీకా స్పుత్నిక్-వి మూడో దశ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. వచ్చేవారంలో నిపుణుల కమిటీ నుంచి ఆమోదం పొందే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed