భారత్‌లో 6 లక్షలు దాటిన కేసులు

by Shamantha N |
భారత్‌లో 6 లక్షలు దాటిన కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటింది. మరో యాభై వేల కేసులు దాటితే రష్యాను వెనక్కి నెట్టి భారత్ మూడవ స్థానంలోకి చేరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో ప్రస్తుతం భారత్ నాల్గవ స్థానంలో ఉంది. ప్రతీరోజు సగటున 18 వేల కంటే ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ఉదయం 8.00 గంటలకు వెలువరించిన బులిటెన్ ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,85,493 మాత్రమే. కానీ సాయంత్రానికి మహారాష్ట్రలో 5,537, తమిళనాడులో 3,882, ఢిల్లీలో 2,442, తెలంగాణలో 1,018, గుజరాత్‌లో 675, ఆంధ్రప్రదేశ్‌లో 657, పశ్చిమ బెంగాల్‌లో 611, హర్యానాలో 313, రాజస్థాన్‌లో 298.. ఇలా పలు రాష్ట్రాల్లో కొత్తగా కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షలు (6,01,412) దాటింది. గడచిన 24 గంటల్లో 507 మంది (బులిటెన్ ప్రకారం) చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 17,400కు పెరిగింది.

పది నగరాల్లో (జిల్లాల్లో) అత్యధిక కేసులు ఉండడం కేంద్రాన్ని ఆందోళనకు గురిచేసింది. ఢిల్లీ నగరంలో పరిస్థితి కొంత అదుపు తప్పిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. కరోనా టెస్టుల సంఖ్యను పెంచడం ద్వారా పాజిటివ్ పేషెంట్లు ఎవరో లెక్క తేలుస్తోంది. ఇంటింటికీ సర్వే జరుగుతోంది. తెలంగాణలో సైతం టెస్టుల సంఖ్య పెరుగుతున్నాకొద్దీ పాజిటివ్ కేసులు బైటకు వస్తున్నాయి. ఇంతకాలం తక్కువ సంఖ్యలోనే టెస్టులు చేయడంతో పాజిటివ్ కేసుల సంఖ్య రెండంకెలు దాటడంలేదు. కానీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలోని వాస్తవిక పరిస్థితి ఇప్పుడిప్పుడే బైటకు వస్తోంది.

Advertisement

Next Story

Most Viewed