మన టాప్ ప్రయారిటీ ఆ నాలుగు జిల్లాలే: జగన్

by srinivas |
మన టాప్ ప్రయారిటీ ఆ నాలుగు జిల్లాలే: జగన్
X

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో దానిని నిర్మూలించడమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా అధికారులు… రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌ల పంపిణీ కార్యక్రమం ఊపందుకుందని సీఎంకు వివరించారు. రెడ్‌, ఆరెంజ్‌ జోన్ల వారిగా మాస్క్‌లును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 225 ట్రూనాట్‌ కిట్స్‌తో విస్తారంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 5022 కరోనా పరీక్షలను(ర్యాపిడ్‌ టెస్టులు కాకుండా) నిర్వహించామని అన్నారు. కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే కరోనా చికిత్స నిమిత్తం గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో ఉన్నవారిని మిగతా ఆస్పత్రులకు తరలించామని వివరించారు.

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పీపీఈ కిట్లు, మాస్క్‌ల స్టాక్‌ను అందుబాటులో ఉంచామని చెప్పారు. మరోవైపు ప్లాస్మా థెరఫీని ప్రారంభించేందుకు కేంద్రాన్ని అనుమతులు కోరామని తెలిపారు. మూడో సారి సర్వే ద్వారా గుర్తించిన 32,000 మందిలో 2,000 మందికి కరోనా టెస్టులు చేశామని చెప్పారు. మిగిలిన వారికి కూడా పరీక్షలు చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి 7100 మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారని అధికారులు తెలిపారు.

అధికారుల చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. వ్యవసాయ రంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పంటలకు సంబంధించిన సమస్యలపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటను సరైన ధరకు కోనుగోలు చేసి, రైతులకు అండగా నిలవాలని అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారుల కోసం గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో మాట్లాడానని సీఎం వెల్లడించారు. వారికి ఆయన అండగా ఉంటానని చెప్పారని ఆయన తెలిపారు.

Tags: andhra pradesh, ap cm, jagan, high level review meeting, Coronavirus, Covid-19

Advertisement

Next Story

Most Viewed