మా భూముల్లో మీ పెత్తనం ఎందీ? : గిరిజనులు 

by Shyam |
మా భూముల్లో మీ పెత్తనం ఎందీ? : గిరిజనులు 
X

దిశ, అచంపేట : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట మండలం ఏజెన్సీ ప్రాంతమైన బొమ్మనపల్లి గ్రామంలో గిరిజనులకు చెందిన భూమిలో రాష్ట్ర ప్రభుత్వం పార్కుల నిర్మాణం చేపట్టాలని భావించింది. దీనిపై భూ హక్కుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మా భూమిలో మీపెత్తనం ఎందనీ ప్రశ్నిస్తున్నారు. గత 40ఏండ్ల కిందట 17 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా నాటి ప్రభుత్వం భూమి కేటాయించింది. తమ పెద్దలకు ఇచ్చిన ఇంటి స్థలాల్లో నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారులు కుట్రలు చేసి గిరిజన ఆదివాసీ, మిగితా జీవులకు ఇచ్చిన ఇంటి స్థలాల్లో పార్క్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడం సరైనది కాదని ఆదివాసీలు మండిపడుతున్నారు.

సోమవారం రాష్ట్ర గిరిజన సంఘం, అచ్చంపేట డివిజన్ వ్యవసాయ కార్మిక సంఘం సహకారంతో అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ఉన్న ఐ టీడీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షులు ధర్మ నాయక్ మాట్లాడుతూ.. 1985 తర్వాత అప్పటి ప్రభుత్వం ప్రభుత్వం ఆదివాసి గిరిజనులకు సర్వే నెంబర్ 158లో గిరిజనులకు ఇంటి స్థలాలు ఇచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు కుట్రలు చేసి అమాయకులైన ఆదివాసీ చెంచు ఇంటి స్థలాల్లో పార్కు నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఆ ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాను స్థానిక రెవెన్యూ అధికారులు చెంచులకు అందజేసినా.. ఐటీడీఏ అధికారుల వద్ద ఎలాంటి రుజువు పత్రాలు, రికార్డులు లేకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని విమర్శించారు. పార్క్‌ల నిర్మాణం చేపట్టడం మంచిదే కానీ, ఆదివాసీలకు ఇచ్చిన స్థలాల్లో నిర్మించడం సరికాదన్నారు. సంబంధిత ఐటీడీఏ అధికారులు ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టి, భూమి హక్కు పత్రాలు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. వారం రోజుల్లో గిరిజనులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మల్లేష్, ఆదివాసీ గిరిజనులు శీలం ఈదమ్మ, శీలం ఎల్లమ్మ, దాసరి వెంకటమ్మ, మల్లేష్, దాసరి రాము లక్ష్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed