తగ్గిపోతున్న ఎన్ఆర్ఐ నిధులు!

by Shyam |
తగ్గిపోతున్న ఎన్ఆర్ఐ నిధులు!
X

దిశ, వెబ్‌డెస్క్: మన దేశం నుంచి వివిధ దేశాలకు ఉపాధి కోసం, జీవనం కోసం, వ్యాపారాల నిమిత్తం దాదాపు 2 కోట్ల మంది 200 దేశాల్లో స్థిరపడ్డారు. ఇందులో మన తెలుగువారు కూడా ఎక్కువే. దాదాపు ఏ దేశానికి వెళ్లినా మనవాళ్ల ఉనికి కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు తారసపడుతూనే ఉంటారు. ప్రపంచదేశాల్లో ప్రవాస భారతీయులు లక్షల మందికి ఉపాధిని అందిస్తూ, అన్ని రంగాల్లో విస్తరించి ఉన్నారు. ఉదాహరణకు అమెరికాలో మనవాళ్లు చాలా ఎక్కువమందే ఉన్నారు. ఇంకా అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో మనవాళ్ల సంపాదన పరంగానూ, ఉద్యోగ పరంగానూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. అనేక దేశాల్లో మనవాళ్లే సంపన్నులుగా నిలుస్తున్నారు. గత నెలన్నరగా దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇంకెన్నాళ్లు ఇలాగే ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఈ పరిణామాలతో పలుదేశాల్లోని వారికి ఉద్యోగ భయం పెరుగుతోంది. దానికి మించి వ్యయం కూడా పెరుగుతుండటం వారిలో ఆందోళన రెట్టింపవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవాస భారతీయులు ఇండియాలో తమ కుటుంబసభ్యుల అవసరాలకు, చెల్లించినాల్సిన ఇతర వాటికోసమని రెమిటెన్స్ పంపించడంతో జాప్యం అవుతోంది. దీనివల్ల మన దేశంలో విదేశీ మారక విలువలు తగ్గిపోతున్నాయి.

20 శాతం తగ్గొచ్చు:

ఇండియాకు అధిక మొత్తంలో విదేశీ మారక నిల్వలను ఎన్ఆర్ఐలు అందిస్తున్నారు. ఏడాదికి వందల బిలియన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఇండియాకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. 2019లో సుమారు రూ.6,22,500 కోట్లు పంపించినట్టు తెలుస్తోంది. ఇలా మన దేశానికి ఎన్ఆర్ఐలు పంపిస్తున్న మొత్తం 476 బిలియన్ డాలర్ల ఫారిన్ ఎక్స్ఛేంజి రివర్వులు ఉన్నాయి. ఈ కారణంగా మన దేశంలోని విదేశీ చెల్లింపులు, కరెంట్ అకౌంట్ చెల్లింపులు సులభతరమవుతున్నాయి. ఇటీవల కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ రెమిటెన్సులు తగ్గినట్టు ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ఈ గణాంకాల్లో అత్యధికంగా దక్షిణాసియా దాదాపు 22 శాతం వరకూ తగ్గే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. ఇండియాసహా మన పొరుగు దేశాలు పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని అందుకుంటున్నాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఇండియాకు వచ్చే రెమిటెన్సులు దాదాపు 20 శాతం తగ్గే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది.

మనవాళ్లే అధికం:

అసలు ప్రపంచ రెమిటెన్సులో ఇండియా వాటా ఎంతో తెలుసా..! ఇంచుమించు 12 శాతం వాటాను కలిగి ఉంది. ఇది మిగిలిన దేశాల కంటే అత్యధికం. 2019లో ప్రపంచవ్యాప్తంగా 714 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు ఉండగా, ఇండియాకు మాత్రమే 83 బిలియన్ డాలర్లు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అన్ని దేశాల్లో లాక్‌డౌన్ ఉండటం, కరోనా సంక్షోభం వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉండటం వల్ల ఈసారి రెమిటెన్సులు భారీగా తగ్గుతాయని తెలుస్తోంది. ప్రపంచబ్యాంకు చెబుతున్న వివరాల ప్రకారం.. యూరప్ రీజియన్ దేశాలకు 28 శాతం తగ్గిపోయే ప్రమాదముందని అంటోంది. తర్వాత ఆఫ్రికా దేశాలకు 23 శాతం నిధుల ప్రవాహం తగ్గనున్నట్టు అంచనా వేసింది.

రెమిటెన్స్ అంటే :

ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా తమ కుటుంబ సభ్యుల కోసం ఇండియాకు డబ్బు పంపిస్తుంటారు. దీన్నే మనం రెమిటెన్సు అంటాం. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియాకు రెమిటెన్సు పంపించడంతో భారతీయులే ముందున్నారు. సంవత్సరానికి ఎన్ఆర్ఐలు లక్షల కోట్లలో ఇండియాకు ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారు. అలాంటిది, గత రెండు నెలలుగా కొవిడ్-19 వ్యాప్తి కారణంగా కరెన్సీ విలువల్లో తేడాలు రావడం, లావాదేవీలకు ఇబ్బందులు తలెత్తడంతో ఈ రెమిటెన్సు తగ్గింది. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే భారతీయులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.

Tags: Revenue, World Bank, Remittances, Economy, India

Advertisement

Next Story

Most Viewed