- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డేంజర్ బెల్స్.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి
దిశ, ఏపీ బ్యూరో: 2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ అంచనాలను తలకిందులు చేశాయి. ముఖ్యంగా చంద్రబాబును కోలుకోలేని దెబ్బ తీశాయి. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఊహించని విధంగా ముచ్చెమటలు పట్టించాయి. నారా లోకేశ్ తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ పరాజయాలన్నింటి నుంచి కోలుకుంటున్న చంద్రబాబుకు ఇటీవల జరిగిన మూడు ఎన్నికలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయట. సొంత నియోజకవర్గంలో వైసీపీ పాగా వెయ్యడం చూస్తుంటే 2024 ఎన్నికలకు ముందే డేంజర్ బెల్ మోగించినట్లుంది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. గత సాధారణ ఎన్నికలు, పంచాయతీ, పరిషత్ ఎన్నికల ఫలితాలపై నిజనిర్ధారణ చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే బీటలు వారిన కుప్పం కంచుకోటకు శస్త్రచికిత్స చేసేందుకు మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈనెల 12 నుంచి 14 వరకు కుప్పంలోనే చంద్రబాబు పర్యటించనున్నారు.
7సార్లు గెలిపించిన కంచుకోట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గం. ఇక్కడ నుంచే చంద్రబాబు 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజారిటీతో విజయాన్ని కట్టబెడుతూ వస్తున్నారు. 2019లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఎప్పుడు మొదటి రౌండ్ నుంచే ఆధిక్యం కనపరిచే చంద్రబాబు…గత ఎన్నికల్లో మొదటి రెండు రౌండ్లలో వెనుకంజలో నిలిచారు. మూడో రౌండ్ నుంచి టీడీపీ పుంజుకుంది. మెుత్తానికి విజయం సాధించారు. చంద్రబాబు గెలుపుతో చిత్తూరు జిల్లాలో టీడీపీ బోణీ కొట్టినట్లైంది. సుమారు 30 వేల ఓట్ల తేడాతో చంద్రబాబు గెలిచినప్పటికీ ఓడి గెలిచాడన్న వార్తలు వినిపించాయి. దీంతో ఏ ఎన్నికలు వచ్చిన రాష్ట్ర ప్రజల దృష్టంతా కుప్పంపైనే ఉండేది.
పంచాయతీ ఎన్నికల్లో ఎదురుగాలి
కుప్పం నియోజకవర్గం పరిధిలోని 89 పంచాయతీలలో 74 చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలుపొందగా.. 14 చోట్ల టీడీపీ మద్దతు దారులు గెలుపొందారు. దీంతో చంద్రబాబు కంచుకోటలో ప్రాబల్యం తగ్గింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బొక్క బోర్లాపడ్డ చంద్రబాబు హడావిడిగా కుప్పంకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు కుప్పంలో మకాం వేశారు. పార్టీ కార్యకర్తలు….గ్రామా స్థాయి నేతల నుంచి నియోజకవర్గ నేతల వరకు పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లో ఉత్సాహం నెలకొంది. తర్వాత జరగబోయే పరిషత్ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగిస్తోందని అంతా భావించారు.
పరిషత్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ
పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. చంద్రబాబు పర్యటనతోనైనా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పుంజుకుంటుందని అంతా భావించారు. అయితే పరిషత్ ఎన్నికల ఫలితాల్లోనూ చంద్రబాబుకు షాక్ ఇచ్చాయి. టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించినా కొందరు తెలుగు తమ్ముళ్లు బరిలోకి దిగారు. కుప్పం పరిధిలోని 19 ఎంపీటీసీ స్థానాలకుగానూ 17 వైసీపీ కైవసం చేసుకోగా…2చోట్ల టీడీపీ గెలుపొందింది. ఇకపోతే రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గుడిపాల మండలంలో 13 స్థానాల్లో 12 వైసీపీ, ఇతరులు ఒక్క స్థానంలో గెలుపొందారు. ఇక శాంతిపురం మండలంలో 18 స్థానాల్లో వైసీపీ 17 కైవసం చేసుకోగా…టీడీపీ ఒకచోట గెలిచింది. ఇక చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. వెయ్యి ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి రాజయ్య గెలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మెుత్తం కుప్పం నియోజకవర్గంలో 85 శాతానికిపైగా పంచాయతీల్లో వైసీపీ గెలిచి రికార్డు సృష్టించింది. ఇవన్నీ బోగస్ ఫలితాలంటూ టీడీపీ ఆరోపించింది. ఎన్నికల్లో అక్రమాలకు నిరసనగానే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని సర్థిచెప్పుకుంది.
కుప్పంపై వైసీపీ స్పెషల్ ఫోకస్
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. చంద్రబాబుకు కంచుకోట అయిన కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఏ ఎన్నికలు వచ్చిన ఆ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట నుంచే రచిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రోత్సహించడం, ప్రభుత్వ పథకాల విషయంలో కాస్త లిబరల్‌గా వ్యవహరించి టీడీపీని బలహీన పరిచే ప్రక్రియ చేస్తున్నారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి లేకుండా చేస్తున్నాయట. వరుస ఎన్నికల ఫలితాలను చూస్తుంటే అధినేత రాజకీయ భవిష్యత్ ఏంటనేదానిపై చర్చిస్తున్నారట.
సొంత గడ్డకు చంద్రబాబు
2019 ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతగడ్డకు చంద్రబాబు పయనమవుతున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో కుప్పంలో పర్యటించేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. ఈ నెల 12న కుప్పం బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు కుప్పం టౌన్‌లో పర్యటిస్తారు. 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటిస్తారు. రామకుప్పం మండలంలో రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నెల 14న కుప్పం గ్రామీణ మండలంలో పర్యటిస్తారు. ఆ తర్వాత గుడుపల్లి మండలంలో చంద్రబాబు పర్యటిస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు కుప్పం వచ్చి మూడు రోజులపాటు కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పార్టీలో నెలకొన్న అసమ్మతిపై దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఈ పర్యటనతోనైనా చంద్రబాబు కుప్పం కంచుకోటను కాపాడుకుంటారా..? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసే వ్యూహాలకు చెక్‌పెడతారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.