‘స్థానిక యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు’

by Shyam |   ( Updated:2021-08-05 21:22:47.0  )
ktr 1
X

దిశ, హుజూర్‌నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని సిమెంట్ కంపెనీలలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సిమెంట్ కంపనీల యాజమాన్యాలతో పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలలో 70 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలని కోరారు. స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పించే కంపెనీలకు ‘నూతన పారిశ్రామిక పాలసీ’ కింద ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులతో పాటుగా ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

అదేవిధంగా సిమెంట్ పరిశ్రమల అవసరాల కోసం స్థానిక యువత సాంకేతిక రంగంలో రాణించడానికి ఓ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హుజూర్ నగర్ నియోజకవర్గం ఓడరేవులకు దగ్గరగా ఉన్నందువలన త్వరలో ఒక పెద్ద ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు అవుతున్నదని చెప్పారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ… స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే అంశంలో స్థానిక పారిశ్రామిక యజమాన్యానికి పూర్తి మద్ధతు ఉంటుందని తెలిపారు. అదే విధంగా అప్రెంటిషిప్ కార్యక్రమాన్ని పున:ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎం‌డి ఈ.వి.నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed