- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారు స్పీడ్‌కు బ్రేకేసేది కమలమే : విజయశాంతి
దిశ, తెలంగాణ బ్యూరో : విజయశాంతి తన రాజకీయ జీవితాన్ని ఎక్కడ మొదలుపెట్టారో చివరకు అక్కడికే చేరుకున్నారు. 1998 రిపబ్లిక్ డే రోజున బీజేపీలో చేరిన ఆమె 2005 మే నెలలో బైటకు వెళ్ళిపోయారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆ తర్వాత టీఆర్ఎస్‌లో విలీనం చేసి రాష్ట్రం ఏర్పడడానికి ముందు కాంగ్రెస్ గూటికి చేరారు. పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ గూటికి చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉంటూ ఆ పార్టీని వీడి సోమవారం బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో బీజేపీలో చేరిన విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ, స్వంత గూటికి చేరుకున్న ఆనందాన్ని వర్ణించలేనని విజయశాంతి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని గద్దె దించడం ఖాయమని, త్వరలోనే ఆ కుటుంబ అవినీతిని బయటపెడతానని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ మినహా మరే పార్టీ ఉండొద్దన్నదే కేసీఆర్ సిద్ధాంతమని, ఇందుకోసం ఉద్దేశపూర్వకంగానే పలు రకాల ప్రలోభాలతో కాంగ్రెస్ సభ్యులను పార్టీలో చేర్చుకుని ఆ పార్టీని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. నిజానికి తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని సోనియాగాంధీకి ఇచ్చిన హామీని బుట్టదాఖలా చేశారని, తాను 2005లో స్థాపించిన ‘తల్లి తెలంగాణ’ పార్టీని బలవంతంగా టీఆర్ఎస్‌లో విలీనం చేయించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించగానే తనను పార్టీ పార్టీ నుంచి వెళ్ళగొట్టారని గుర్తుచేశారు.
కేసీఆర్ కంటే ముందే తాను తెలంగాణ కోసం గొంతెత్తానని, 1998లో బీజేపీలో ఉంటూనే తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్‌ను పార్టీలో ప్రస్తావించానని, అయితే ఏడేళ్ళ తర్వాత తెలంగాణ విషయంలో పార్టీ నాయకత్వంలో నిన్నాభిప్రాయం రావడంతో తాను ఆ పార్టీని విడిచిపెట్టాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ కోసమే బీజేపీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. అదే తెలంగాణ డిమాండ్‌తో ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించానని, ఆ తర్వాత పార్టీని విలీనం చేయాలంటూ తనపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. అలా టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత తాను, కేసీఆర్ ఎంపీలుగా గెలిచామని, తెలంగాణ ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన రోజే 2013లో తనను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. తనంతట తానుగానే స్వచ్ఛందంగా పార్టీ నుంచి బైటకు వెళ్ళినట్లుగా ప్రచారం చేయించిన కేసీఆర్ నిజానికి సోనియాగాంధీకి మాట ఇచ్చి యు టర్న్ తీసుకున్నారన్నారు.
తెలంగాణలో కొట్లాడే నేతలు ఉండకూడదన్న ఆలోచనతోనే కేసీఆర్ అందర్నీ ఆ పార్టీలో చేర్చుకున్నారని, కానీ ఆయన ఊహించని విధంగా బీజేపీ ఎదిగిందని, భవిష్యత్తులో ఆయనను, టీఆర్ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. దుబ్బాకలో, జీహెచ్ఎంసీలో వరుస గెలుపులు సాధించిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే అభిప్రాయం బలపడిందన్నారు. కేసీఆర్‌ని గద్దె దించడం, ఆయన అవినీతిని బయటపెట్టడం ఖాయమన్నారు. దేశంలోనే అత్యధిక స్థాయిలో అవినీతి జరుగుతోంది తెలంగాణలోనే అని, భవిష్యత్తులో (2023 అసెంబ్లీ ఎన్నికల్లో) అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని అన్నారు. విజయశాంతి ఏ పార్టీలో ఉన్నా కీలక భూమికే పోషిస్తుందన్నారు.
కాంగ్రెస్ నుంచి బైటకు రావడానికి దారితీసిన పరిస్థితుల గురించి విజయశాంతి వివరిస్తూ, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలైన సమస్యలపై పోరాటం చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ స్లో పాయిజన్ ఎక్కించారని, చివరకు అది పోరాడలేని స్థితికి చేరుకుందన్నారు. ఏడాది కిందటే బీజేపీలో చేరాలని తాను అనుకున్నానని, కానీ ఇప్పుడు సాధ్యమైందన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే ఇప్పుడు తన లక్ష్యమని, పార్టీ నాయకత్వం ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణ ప్రజలు బాగుపడడమే తాను కోరుకుంటున్నదని అన్నారు.