శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

by Aamani |
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి వరద కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం నుంచి 2 లక్షల పైచిలుకు వరద వస్తూనే ఉంది. అంతేస్థాయిలో 33 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1089.90 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టులో 90 టీఎంసీలకు గాను.. 84.291 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు సైట్ ఇఇ చక్రపాణి తెలిపారు. నిజామాబాద్, నిర్మల్, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో భారీ వర్షాలు తోడు కావడంతో.. ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున గోదావరి నది వరద రావడంతో గురువారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టంకు చేరిన విషయం తెలిసిందే.

గురువారం 35 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిన అధికారులు.. 4 లక్షల వరద నుంచి 2 లక్షలకు చేరడంతో ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను క్రమం తప్పకుండా తగ్గించారు. ప్రాజెక్టులోకి జూన్ 1 నుంచి 87.728 టీఎంసీల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి 22.393 టీఎంసీల నీరు దిగువకు వదిలారు. గురువారం ఒక్కరోజే 24 గంటల్లోనే 20 టీఎంసీల పైచిలుకు నీరు దిగువకు వదలడం విశేషం.

ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఉదయం ప్రాజెక్టులో 3 లక్షల వరద వస్తున్న సమయంలో 3 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతుండగా అధికారులతో కలిసి డ్యామ్ ను పరిశీలించారు. ఎస్ఇ శ్రీనివాస్, ఇఇ చక్రపాణి, ఇంజనీర్లు వంశీ, రవి తదితరులు ప్రాజెక్టు వివరాలను కలెక్టర్ కు వెల్లడించారు.

ప్రాజెక్టు ప్రాంతాలకు సందర్శలకు నో ఎంట్రీ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిండిపోవడంతో గురువారం నుంచి గేట్లు ఎత్తారు. గురువారం 35 గేట్లు ఎత్తగా శుక్రవారం వాటిని తగ్గించి 33 గేట్లకు కుదించారు. జిల్లాలో రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తున్న ప్రాజెక్టు అందలను చూడడానికి ప్రజలు వస్తారని భావించిన అధికారులు సందర్శనకు అనుమతించలేదు. ఏకంగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రాజెక్టులోకి అనుమతించడం లేదని పోలీసుల గేట్లను మూసివేశారు.

Advertisement

Next Story